ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నాయకుడు ఆర్‌పి.రాజు ఆశయ సాధనకు కృషిచేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఇటీవల ఆకస్మిక మరణం పొందిన ఆర్‌పి.రాజు సంస్మరణ సభ బుధవారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు టి. చిరంజీవి అధ్యక్షతన జరిగింది. సభకు ముఖ్య వక్తగా మాల్యాద్రి హాజరై మాట్లాడారు. నిబద్దత కల్గిన కార్యకర్తే కాక, పట్టుదల గల నాయకుడన్నారు. ప్రజల దైనందిన సమస్యలపైనే గాక, దళిత, గిరిజన, బలహీన వర్గాల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ విధానాలపై రాజీ లేని పోరాటం చేసేవారని కొనియాడారు. నేడు బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మనుధర్మశాస్త్రిని ప్రజలమీద రుద్దే తరుణంలో ఆర్‌పి రాజు మరణం దళిత,పేద ప్రజానీకానికి తీరని లోటు అన్నారు.
కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.లోకనాధం మాట్లాడుతూ, పేదల ఐక్యత కోసం కృషి చేసిన ఆర్‌పి.రాజు ధన్యజీవి అన్నారు. ఆయన చేసిన కృషి ఒక శక్తిగా మారుతున్న సమయంలో చనిపోవడం దురదృష్టకరమన్నారు. కెవిపిఎస్‌గా విశాఖ జిల్లాలో దళితలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఆర్‌పి.రాజు కృషి చేసారన్నారు. దళితలకు దేవాలయ ప్రవేశం కోసం, 2 గ్లాసులు పద్దతికి వ్యతిరేకంగా విశాఖ నగరంలో జెర్రిపోతులపాలెం, పెందుర్తి ప్రాంతాల్లో దళతులపై జరిగిన దాడులపై ప్రత్యక్ష పోరాటాలు జరిపారని తెలిపారు. తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం ప్రాంతాల్లో గిరిజనులకు, దళితలకు సంఘాలు ఏర్పాటుచేసి వారి హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారన్నారు.
దళిత హక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు జెవి ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలపై పోరాడాలన్నారు. ఈ సంసర్మణ సభలో భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్దార్థ, దళిత ఆదివాసీ సంఘాల జెఎసి కన్వీనర్ పతివాడ రాంబాబు, జివిఎంసి మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు, దళిత హక్కుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి వెంకట రమణ, విశాఖ జిల్లా దళిత సంఘాల జెఎసి కన్వీనర్ బూసి వెంకటరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు భాగం లక్ష్మి, కూరపాటి అప్పారావు, గిరిజన సంఘం నాయకులు చిన్నం నాయుడు, కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల సుబ్బన్న, స్టీల్‌ప్లాంట్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి.దాస్ తదితరులు ప్రసంగిస్తూ ఆర్.పి.రాజు సేవలను కొనియాడారు. సభలో ఆర్‌పి.రాజు భార్య ధనలక్ష్మి, పిల్లలు నవీన్, జీవన్, స్వర్ణ, కుటుంబసభ్యులు గణపతి, సుధీర్‌లతో పాటు కెవిపిఎస్ నాయకులు కె.కిరీటం, సంతోషం, ఐసి నాయుడు, విఎన్.కుమార్, పైడితల్లి, ఎం.సుబ్బారావు, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.










