ప్రజాశక్తి - ఆరిలోవ : ఆర్‌పి.రాజు ఆశయ సాధనకోసం పనిచేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పేర్కొన్నారు. సిపిఎం ఆరిలోవ జోన్ కార్యదర్శి వి.నరేంద్రకుమార్ అధ్యక్షతన భగత్‌సింగ్ నగర్‌లో సోమవారం ఆర్‌పి రాజు సంతాప నిర్వహించారు. ముందుగా ఆర్‌పి.రాజు చిత్రపటానికి జగ్గునాయుడుతోపాటు పార్టీ కంచరపాలెం జోన్ కార్యదర్శి బొట్టా ఈశ్వరమ్మ, మల్కాపురం జోన్ కార్యదర్శి పైడిరాజు, ఐద్వా ఆరిలో కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గౌరి, రంగమ్మ, సిపిఎం నాయకులు వి.కృష్ణమూర్తి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్గునాయుడు మాట్లాడుతూ, ఆర్‌పి రాజు అకాల మరణం అతనికి కుటుంబానికి, పార్టీకి తీవ్ర లోటు అన్నారు. పార్టీ ఆశయ సాధనకోసం నిరంతరం కృషి చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల తరపున నిరంతరం పోరాడిన రాజు సేవలు మరువలేనివన్నారు. ఆర్‌పి.రాజు కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పి రాజు భార్య ధనలక్ష్మి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ సభ్యులు వి.శాంతి, కుమారి తదితరులు పాల్గొన్నారు.










