Nov 08,2023 22:43

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : టిడిపి నాయకులు నారాలోకేష్‌ తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని అపద్దమని తేలితే అందుకు ఆయన సిద్ధమా అని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆయన బుధవారం పట్టణంలోని తన స్వగృహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్‌ పూర్తి విషయం తెలుసుకుని పరిజ్ఞానంతో మాట్లాడాలని హితవు పలికారు. ఎవరో చెప్పిన మాటలువిని ఒక శాసనసభ్యునిపై తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. అగళి మండలం రావుడి గ్రామంలో వాలంటర్‌ గొడవ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పాత కక్షలతో రెండు కుటుంబాలు గొడవలు పడి పోలీసుకేసులు పెట్టుకొంటే అందులో తన ప్రమేయం ఉందని ప్రచారంచేసి నిందలు వేయడం తగదదన్నారు. ఆ విషయంతో తన ప్రమేయముందని రుజువు చేస్తే తాను రాజకీయాలనుండి తప్పుకొంటానని నిరూపించక పోతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్‌ విసిరారు.
దళితులను అవమానించడమే పనిగా పెట్టుకున్న 'గుండుమల' : మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి దళితులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి ఆరోపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండుమల తిప్పేస్వామి తనపై చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా జగన్మోహన్‌ రెడ్డి తనకు అవకాశం కల్పించారన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉన్న తనను టికెట్లు అమ్ముకుంటున్నాడని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆయనలా తాను సారాయి పాకెట్లు అమ్ముకొని వేలాది కోట్లు సంపాదించలేదని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించలేదని ఆరోపించారు. క్రషర్లు, గ్రానైట్‌ క్వారీలో ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు వేల కోట్లు జరిమానా విధించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈరన్నను అవమానించింది నిజం కాదా అని అన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయం చేయాలని హితవు పలికారు.