ప్రజాశక్తి-చీరాల: హెర్నియా సమస్యతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యశ్రీ వైద్య సేవల ద్వారా ఉచిత వైద్యాన్ని ఉపయోగించుకోవాలని డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ కోరారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్‌లో మంగళవారం నిర్వహించిన ఉచిత హెర్నియా వైద్య శిబిరంలో సుమారు 53 మందికి కన్సల్టేషన్, రక్త పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ అవసరమైన వారికి డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు. అన్ని రకాల ఎముకల ఆపరేషన్లు, జనరల్, లాప్రోస్కోపి ఆపరేషన్లు, కిడ్నీలో రాళ్ల ఆపరేషన్లు, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా తమ హాస్పటల్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. రోగి చేరిన 24 గంటలలోపే ఆపరేషన్‌కు సబంధించిన అనుమతులను ట్రస్ట్ అందజేస్తుందని తెలిపారు. డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హెర్నియా సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని, శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్‌లో నిరంతర పరివేక్షణలో వైద్యులు అందుబాటులో ఉన్నారని, హెర్నియా ఉన్నవారికి ఉచిత ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ తులసీరాం, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ ముఖేష్ రెడ్డి, హాస్పటల్ జీఎం తాడివలస సురేష్, ఆరోగ్యమిత్ర అనిల్, బోయజ్, శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ వైద్య సిబ్బంది, హెర్నియా రోగులు పాల్గొన్నారు.










