Nov 05,2022 21:35

రూ.వెయ్యి ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ అంటున్న ప్రభుత్వం
ఎక్కడా అమలు కాని ప్రభుత్వ నిబంధనలు
ఆరోగ్యశ్రీ వర్తించినా కనీసంగా రూ.50 వేలు బాదుడు
ప్రశ్నిస్తే వేరే ఆసుపత్రికి వెళ్లాలంటూ హుంకరింపులు
గత్యంతరం లేక అప్పు చేసి వైద్యం చేయించుకుంటున్న పేదలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

'మెట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురవ్వడంతో ఎముకలకు సంబంధించిన సమస్య వచ్చింది. దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్తే అన్ని పరీక్షలూ చేసి ఆపరేషన్‌ చేయాలన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ అమలులో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కూడా మళ్లీ అన్ని టెస్టులూ చేసి రూ.25 వేలు ఖర్చు పెట్టించి ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీలో వచ్చే సొమ్ము సరిపోదని, రాడ్లు వేయడానికి అదనంగా సొమ్ము ఖర్చవుతుందని చెప్పడంతో వారికి ఏం చేయాలో అర్థంకాక అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.'
'తణుకు ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నెలలు తక్కువతో బిడ్డ జన్మించాడు. ఇంక్యుబేటర్‌లో (బాక్సు) పెట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పెట్టకుండా రోజుకు రూ.20 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైంది.'
పైన పేర్కొన్న ఘటనలు మచ్చుకు మాత్రమే. అనారోగ్యంతో ఆరోగ్యశ్రీ కార్డులతో ఆసుపత్రులకు వెళ్తున్న రోగుల నుంచి కార్పొరేట్‌, ప్రయివేటు ఆసుపత్రులు విచ్చలవిడిగా దోచేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతున్నప్పటికీ పేదలకు పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీలో జరుగుతున్న తంతును ఒకసారి గమనిస్తే ఆసుపత్రి యాజమాన్యాలు ఏవిధంగా దోచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రోగులు వెళ్తున్నారు. ఓపి చీటీ తీసుకుని వైద్యునికి చూపించుకుంటున్నారు. రక్త పరీక్షలు, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ఇలా అనేక పరీక్షలు చేస్తున్నారు. ఆసుపత్రిని బట్టి దాదాపు రూ.పది వేల నుంచి రూ.20 వేలు వరకూ గుంజుతున్నారు. తర్వాత ఆపరేషన్‌ పడుతుందని చెప్పి ఆరోగ్యశ్రీలో పెడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ వర్తించాలంటే అప్పటి వరకూ రోగికి చేసిన పరీక్షల రిపోర్టులు, స్కానింగ్‌లకు సంబంధించిన రిపోర్టులను అప్‌లోడ్‌ చేయాలి. వాటిని పరిశీలించాక ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారు. ఆరోగ్యశ్రీ అప్రూవల్‌ అయిన తర్వాత తొలుత చేసిన టెస్టు రిపోర్టులకు సంబంధించిన సొమ్ము సైతం సదరు ఆసుపత్రికి వస్తోంది. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ వర్తింపచేసిన తర్వాత ముందుగా టెస్టుల పేరుతో ఖర్చు చేసిన సొమ్మును ఆసుపత్రి యాజమాన్యం రోగికి వెనుకకు ఇవ్వాలి. ఏఒక్క ఆసుపత్రిలోనూ ఇది జరగడం లేదు. అంతేకాకుండా టెస్టులు చేసిన తర్వాత వెంటనే ఆపరేషన్‌ చేయకుండా నాలుగైదు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పి రూ.50 వేలు వరకూ లాగేస్తున్నారు. తర్వాత ఆరోగ్యశ్రీలో ఆన్‌లైన్‌ చేసి ఆపరేషన్‌ చేస్తున్నారు. రోజులు నిండకుండా, శ్వాస వంటి సమస్యలతో పుట్టిన పసికందులను ఇంక్యూబేటర్‌లో పెట్టేందుకు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఎక్కడా అది అమలు కావడం లేదు. నాలుగైదు రోజులు సొమ్ము తీసుకుని తర్వాత ఇంక్యూబేటర్‌లో పెడుతున్నారు. మొదట నాలుగు రోజులకు రోజుకు రూ.20 వేలు చొప్పున రూ.లక్ష వరకూ దోచేస్తున్నారు. కిడ్నీ, గుండె వంటి సమస్యల్లో ఏఒక్క అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లినా ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయించుకున్నప్పటికీ కనీసంగా రూ.40 వేలకుపైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ముందుగా చేసిన టెస్టులకు సొమ్ము రాదని చెబుతున్నారు. దీనిపై రోగులకుగాని, వారి కుటుంబ సభ్యులకుగానీ అవగాహన ఉండటం లేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వేరే ఆసుపత్రికి తీసుకుపోండంటూ ఆసుపత్రి యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే అనారోగ్యంతో ఉన్న తమవారికి ఏమైనా అవుతుందేమోననే భయం కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఆసుపత్రుల చుట్టూ తిప్పలేక మౌనంగా ఉండిపోతున్నారు. ఎముకలకు సంబంధిం చిన ఆపరేషన్‌ జరిగితే ఆరోగ్యశ్రీలో రాడ్లు బాగోవని, అదనంగా మరో రూ.30 వేలు, రూ.40 వేలు వరకూ ఖర్చు చేయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ఫలాలు పేదలకు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి నెలకొంది.
అవగాహన కల్పించడంలో ఆరోగ్యమిత్రలు విఫలం
ప్రతి ఆరోగ్యశ్రీ ఆసుపత్రి ఆవరణలో ఆరోగ్యమిత్ర ఉంటారు. ఆరోగ్యశ్రీ వర్తించాలంటే వారే ఆన్‌లైన్‌ చేయాలి. అక్కడ జరుగుతున్న తంతు అంతా వారికి తెలిసినప్పటికీ రోగులకుగాని, వారి బంధువులకుగాని అవగాహన కల్పించడంలో ఆరోగ్యమిత్రలు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి సొమ్ము ఏమైనా ఖర్చు పెట్టారా.. యాజమాన్యం మీకు తిరిగిచ్చిందా.. అని అడిగే దాఖలాల్లేవు. ఒకవేళ జరిగినా అది తూతూమంత్రంగానే తప్ప రోగికి న్యాయం చేసేలా ఉండటం లేదు. ముందుగా చేసిన టెస్టుల సొమ్ము యాజమాన్యం తిరిగివ్వాలని, ఆవిధంగా ఏమైనా ఖర్చు చేశారా అని కూడా అడగని పరిస్థితి నెలకొంది. గతంలో ఆరోగ్యమిత్ర కేబిన్‌ల వద్ద వారి ఫోన్‌ నెంబర్లు బోర్డుపై రాసి పెట్టేవారు. చాలాచోట్ల ఇప్పుడు ఆ ఫోన్‌నెంబర్లు అనేవి లేవు. ఒకవేళ అడిగినా ఇవ్వని పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ నిబంధనలను ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆరోగ్యమిత్రలు అవగాహన కల్పిస్తే సామాన్య ప్రజానీకానికి మరింత ప్రయోజనం చేకూరుతోంది.
ఆరోగ్యశ్రీలో ఉచితంగానే వైద్యం
టి.ఆండ్రో ఆల్బర్ట్‌లూయిస్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌
ఆరోగ్యశ్రీలో చేరిన రోగులకు ఉచితంగానే వైద్యం ప్రభుత్వం అందిస్తోంది. ఎటువంటి సొమ్మూ చెల్లించాల్సిన అవసరం లేదు. ఏమైనా అనుమానాలు ఉంటే ఆరోగ్యమిత్రను కలిస్తే వివరాలు చెబుతారు. ఆరోగ్యశ్రీ ఆమోదమైన తర్వాత ముందుగా చేసిన టెస్టుల సొమ్ము కూడా రోగికి చెల్లించాల్సి ఉంది. ఆరోగ్యశ్రీలో చేరిన తర్వాత కూడా డబ్బు వసూలు చేస్తే ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.