గడువు, సర్వీసు నిబంధనతో
అనేక మంది రెగ్యులరైజేషన్‌కు దూరం
ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతప్తి
ప్రజాశక్తి -పాడేరు: పాడేరు ఏజెన్సీలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులకు సర్వీస్ క్రమబద్ధీకరణ అందని ద్రాక్షగా మారుతోందనే ఆవేదన వ్యక్తమౌతోంది. ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం, 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేస్తామని మెలిక పెట్టింది. దీంతో ఏజెన్సీలో గత పదేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న అనేకమంది సర్వీస్ క్రమబద్ధీకరణకు నోచుకోని పరిస్థితి ఎదురయ్యింది. దీంతో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తూ చదివిస్ క్రమబద్ధీకరణకు జరగదని నిరాశ చెందుతున్నారు.
పాడేరు ఏజెన్సీలోని వైద్యారోగ్య శాఖలో 2002నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు జరిగాయి 2002 డిఎస్‌సిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 42 మంది గిరిజనేతరులు, మరో 60 మంది గిరిజన అభ్యర్థులు ఎంపిహెచ్‌ఎ (మేల్) ఉద్యోగాలకు ఎంపికయ్యారు వీరంతా 2003లో విధుల్లో చేరారు. రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనలో వీరు మాత్రమే సర్వీస్ క్రమబద్దీకరణకు నోచుకోనున్నారు. అయితే పాడేరు ఏజెన్సీలో 2012 నుంచి వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల నియమకాలు ఎక్కువ జరిగాయి. ఈ మేరకు 2012లో 29 మంది ఎంపీహెచ్‌ఏలు, 2015లో 52 మంది ఎంపీహెచ్‌ఏ (మేల్), 46 మంది ఎంపిహెచ్‌ఎ (ఫిమేల్) అలాగే ప్రభుత్వ జిల్లా, కమ్యూనిటీ ఆసుపత్రిలో 150 మంది స్టాఫ్ నర్స్‌ల నియామకం జరిగింది. అలాగే 2017లో మరో 13 మంది ఎంపీహెచ్‌ఏ (మేల్) 24 మంది స్టాఫ్ నర్సులు, 33 మంది ఫార్మసిస్టులు కాంట్రాక్ట్ పద్ధతిపై నియమితులయ్యారు ఇదే ఏడాది ప్రభుత్వ జిల్లా ,కమ్యూనిటీ ఆసుపత్రిలో మరో 120 మంది స్టాఫ్ నర్సులు నియమితులయ్యారు. ఈ విధంగా పాడేరు ఏజెన్సీలో వైద్య ఆరోగ్యశాఖ అంతా కాంట్రాక్టు ఉద్యోగులతోనే నిండి ఉంది.
ప్రభుత్వ ప్రకటనతో 400మందికి నిరాశ
2012 నుంచి 2017 వరకు కాంట్రాక్ట్ పద్ధతిపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కొందరికి పదేళ్లు మరికొందరికి ఐదేళ్ల సర్వీసు పూర్తయింది. కానీ 2014 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తికానందున. సుమారు 400 మందికి పైగా ఎంపీహెచ్‌ఏలు, స్టాఫ్ నర్స్‌లు సర్వీస్ క్రమబద్ధీకరణకు నోచుకోని పరిస్థితి ఉంది, ఏజెన్సీ వైద్యారోగ్య శాఖలో ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవుతూ ఏళ్ల తరబడి తాము అందిస్తున్న సర్వీసును గుర్తించి ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఐదేళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలి
ఏజెన్సీలో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ,రెగ్యులరైజేషన్‌కు ప్రభుత్వం విధించిన 2014 జూన్ 2 కటాఫ్ తేదీతో 10 శాతం మంది సర్వీసు మాత్రమే క్రమబద్ధీకరణ జరగనుంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలి.
శెట్టి నాగరాజు. జిల్లా అధ్యక్షుడు
కాంట్రాక్ట్ గిరిజన వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం. పాడేరు










