
ప్రజాశక్తి-హిందూపురం : పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆరోగ్యంపై పాఠశాల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించడం అభినందనీయమని ప్రముఖ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ డాక్టర్ జక్కా నరేంద్ర అన్నారు. పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్స్ హై స్కూల్‌లో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలోకార్డియాలజిస్ట్ డాక్టర్ జక్కా నరేంద్ర, జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ నందిత తదితరులు ఉపాధ్యాయులకు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పాఠశాల తరపున అందరికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పాంచజన్య శ్రీనివాసులు మాట్లాడుతు పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందితో పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్న కొంతమంది విద్యార్థులకు, బస్సు డ్రైవర్లు, క్లీనర్లు అందరి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ ఉద్దేశంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నంద కుమార్, హెచ్‌ఎం గాయిత్రి, ఎఒ భాస్కర్, సూపరింటెండెంట్ విజయేంద్ర, ఎహెచ్‌ఎంలు శశికళ, సతీష్ కుమార్, షేక్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.