- ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: ఆరోగ్యంపై శ్రద్ధ వహించి శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్ మైదానంలో జిల్లావ్యాప్తంగా అన్ని సర్కిల్ కార్యాలయాల పరిధిలో పోలీస్ సిబ్బందితో పెరేడ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పరేడ్‌ను పరిశీలించి, సిబ్బంది గౌరవ వందనాన్ని ఎస్‌పి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యమన్నారు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంతో ఉన్నప్పుడే ప్రజలకు సేవలు అందించగలమని తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఆర్మ్‌డ్, సివిల్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది అనారోగ్య, ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను విన్నవించగా, సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్‌పి భరోసానిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు వై.శృతి, ఎస్.బాలరాజు, జి.వి ప్రసాదరావు, ఆర్‌ఐ బి.ప్రదీప్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అత్యాశకు పోయి మోసపోవద్దు
రూ.రెండు వేల నోట్లు రద్దయిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు నోట్ల మార్పిడికి అసలు నగదు కంటే అదనంగా ఇస్తామని ఆశ చూపి మోసగిస్తున్నారని ఎస్‌పి జి.ఆర్ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 నోట్ల కట్టలు అందిస్తే అంతకు పది శాతం కలిపి రూ.రెండు వేల నోట్లు అందిస్తామని మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నారని పేర్కొన్నారు. అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించారు. ఇలాంటి మాయమాటలు చెప్పే అపరిచిత వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.










