ప్రజాశక్తి-యంత్రాంగం
గాజువాక: జివిఎంసి 65వ వార్డు పరిధి గిరిజాకాలనీలో యుపిహెచ్‌సి ఆధ్వర్యాన శనివారం ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రియదర్శిని కాలనీ మీదుగా ప్రచార ర్యాలీ సాగింది. ర్యాలీలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలామంది రోగాల బారిన పడుతున్నారని, ఇటువంటి సమయంలో వైద్యుల సూచనలు, సలహాలు తీసుకొని జాగ్రత్తలు పాటించాలని కోరారు. ధూమపానం, మద్యపానం, ఇతర మత్తు పదార్థాలకు దూరంంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తినా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సతీష్, స్థానిక నాయకులు గిరి, గండి అప్పలరాజు, జానా సతీష్, పెండ్ర రాజు, అవంతి తదితరులు పాల్గొన్నారు.
కేన్సర్‌పై అవగాహన ర్యాలీ
పెందుర్తి : జివిఎంసి 94వ వార్డు పరిధి వెంకటసాయినగర్‌లో వైఎస్‌ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యాన కేన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 94వ కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరూ మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులు, బయట చిరు తిళ్లకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు బానిస కావద్దని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.










