ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదని పలువురు వక్తలు సూచించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు యూనిట్ అధ్వర్యంలో విజయ హాస్పిటల్స్ డాక్టర్ రితేష్ హార్ట్‌కేర్ వారి సాయంతో ఆదివారం ఉచిత మెగా గుండె, నేత్ర, సాధారణ వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక జెవిఆర్ నగర్‌లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ పి.దామోదరరెడ్డి, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి.రితేష్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఇటీవల కాలంలో వివిధ పరిస్థితుల వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. చిన్న వయసు వారికి కూడా గుండెకు సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయని, జాగ్రత్తలు తీసుకొని ఒత్తిడికి గురి కాకుండా మితమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలని సూచించారు. అవసరమైతే డాక్టర్లను సంప్రదించి మందులు వాడాలని, ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దని కోరారు. కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ శిబిరంలో సుమారు 150 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులకు ఇసిజి, ఎకో పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల ద్వారా 30 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్‌వివిఎస్.ప్రసాద్, కార్యదర్శి దేవినేని భాస్కరరావు, కోశాధికారి ఎం.శాంతారావు, జిల్లా అధ్యక్షులు ఎం.శివరామకృష్ణారావు, విజయ హాస్పిటల్ మేనేజర్ ఎం.సతీష్ పాల్గొన్నారు.










