Oct 20,2023 22:58

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్‌ స్థాయి వైద్యం అంటూ వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో ఒక్క రూపాయి ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ప్రచార ఆర్భాటాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. శిబిరాల్లో ఎక్కడా స్పెషలిస్టు డాక్టర్లు కానరావడం లేదనీ, అరకొర పరీక్షలు, మందులు, పరీక్షలతోటే సరిపెట్టేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్య సేవలు పొందేందుకు వచ్చేవారిని కూర్చోబెట్టి, గంటల తరబడి సమావేశాలు నిర్వహించి, కొంతమందికి సీఏం ఫొటో ముద్రించి ఉన్న సంచులు (కిట్లు) ఇస్తున్నారే తప్ప పూర్తిస్థాయి పరీక్షలు చేసి, మందులు ఇవ్వడం లేదంటూ కొందరు రోగులు పెదవి విరుస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసుకుని ఉన్నత వైద్యం కోసం పెద్దాస్పత్రులకు రెఫర్‌ అయిన రోగులకు అక్కడ కూడా అరకొర వైద్యమే అందుతుండటం విచారకరం. ఇటీవల శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో నిర్వహించిన శిబిరాల నుంచి రెఫర్‌ అయిన సుమారు వెయ్యికి పైగా రోగులు శుక్రవారం శ్రీకాళహస్తికి రాగా వీరికి అందుబాటులో లేని వైద్యులు, అరకొర పరీక్షలు, మందులే దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనం.
రోగాలను ముందస్తుగా గుర్తించి వాటిని తక్కువ ఖర్చుతోనే నయం చేసేలా వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 15,005 సచివాలయాల ద్వారా 1.67 కోట్ల పేద కుటుంబాలకు పైసా ఖర్చు లేకుండా వ్యాధులను గుర్తించి నయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే జగనన్న సురక్ష శిబిరాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. శిబిరాల వద్ద 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు, అనుభవజ్ఞులైన స్పెషలిస్టు వైద్యులను అందుబాటులో ఉంచాల్సి ఉండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.
జగనన్నకు చెప్పుకోండి!
శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో గత నెల రోజులుగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు శరవేగంగా జరుగుతున్నాయి. వాలంటీర్లు, వైద్య సిబ్బంది గుర్తించిన రోగులు ఈ శిబిరాలకు టోకెన్లతోటి హాజరవుతున్నారు. అయితే శిబిరాల వద్ద అర్బన్‌, మండల స్థాయిలో పనిచేసే వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండడంతో స్పెషలిస్టుల కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వెయ్యికి పైగా రెఫర్‌ రోగులు పెద్ద ఎత్తున ఏరియా ఆసుపత్రికి రాగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమందిని తూతూమంత్రంగా పరీక్షించి పంపేయడంతో రోగులు వైద్యుల తీరుపై మండిపడ్డారు. ఈ మాత్రం దానికి మాకు టోకెన్లు, వారం రోజుల నిరీక్షణ, వ్యయ, ప్రయాసలు అవసరమా అంటూ నిలదీశారు. పైగా ఆరోగ్యశ్రీ లో చికిత్స చేసుకోండి అంటూ ప్రయివేట్‌ ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే జగనన్నకు చెప్పుకోండని ఉచిత సలహా ఇచ్చారంటూ మండిపడ్డారు. ఈ విషయంపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మిని వివరణ కోరగా శుక్రవారం 50 మంది రెఫర్‌ రోగులు మాత్రమే వచ్చారనీ, అందరికీ పరీక్షలు చేసి, మందులిచ్చి పంపినట్లు తెలిపారు. ఒక్కర్ని మాత్రమే అడ్మిషన్‌ లో ఉంచామని చెప్పడం గమనార్హం.