Apr 04,2021 06:57

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం...'ఒక మంచి, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మించాలి' అని పిలుపునిచ్చింది. 'ఈసురోమని మనుషులుంటే/ దేశమేగతి బాగుపడునోరు../ తిండి కలిగితే కండగలదోరు../ కండగలవాడేను మనిషోరు'.. అన్నారు గురజాడ వారు. ఆకలి, దారిద్య్రం వెంటాడుతోంటే, ఈసురోమని మనుషులు.. అనారోగ్యంతో కునారిల్లుతోంటే... ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఎలా నిర్మించగలుగుతాము? సగటు మనిషి బతకడానికి అవసరమైన కూడు, గూడు, గుడ్డ... ఇప్పుడు సంక్షోభంలో పడింది. ఆకలి, నిరుద్యోగం పెరిగింది. పౌష్టికాహార లోపం, పర్యావరణ కాలుష్యం, గాలి, నీరు కలుషితం పెరిగింది. జబ్బుల బారిన పడకుండా ఉంటే చాలు... అదే మహాభాగ్యం అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ- ఆరోగ్యానికిచ్చిన నిర్వచనం సమగ్రమైనది, సరైనది కూడా. అయితే... మనిషి కేవలం శారీరకంగానే కాక, మానసికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక మంచి, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది.
ప్రతి మనిషీ ఉన్నతమైన ఆరోగ్య ప్రమాణాలను అనుభవించాలి. కుల, మత, ఆర్థిక, సామాజిక అంశాలతో సంబంధం లేకుండా ఆరోగ్యం హక్కుగా వుండాలని రాజ్యాంగం చెబుతోంది. మనం నివసించే ప్రాంతం దగ్గర నుంచి పని ప్రదేశం వరకు... ఆరోగ్యం ప్రతి మానవుడి ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా వుండాలి. ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో ఆరోగ్యం... ఎంత వుందో కోవిడ్‌-19 మనకు తేటతెల్లం చేసింది. సంపన్న దేశాలు సైతం కోవిడ్‌ మహమ్మారిని నిలువరించే ప్రయత్నాలు చెయ్యలేక చతికిలబడ్డాయి. రెండో వేవ్‌, మూడో వేవ్‌ అంటూ కరోనా విజంభిస్తున్నా...దాన్ని నిర్వీర్యం చేయడంలో ఇంకా ప్రతికూల పర్యవసానాలనే ఎదుర్కొంటున్నాము. మరోవైపు చైనా, క్యూబా, వియత్నాం, ఉభయ కొరియా దేశాలు కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచాయి.
అయితే, ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న దేశాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందే అవకాశం తక్కువగా వుండడంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సురక్షితమైన పరిసరాలు, పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, ఆహార భద్రత, ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు. గోడౌన్లలో కోట్లాది క్వింటాళ్ల ధాన్యం ముక్కిపోతున్నా పేదలకు గింజ కూడా రాల్చడంలేదు. మన దేశంలో శత కోటీశ్వరుల సంపద దాదాపు రూ.13 లక్షల కోట్లు పెరిగింది. ఇదే సమయంలో 12.5 కోట్ల మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన గత ఏప్రిల్‌ నెలలో గంటకు 1,70,000 మంది చొప్పున నిరుద్యోగులయ్యారు. దీంతో ఆకలి, దారిద్య్రం, పౌష్టికాహార లోపంతో ముఖ్యంగా పిల్లలు, మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచంలోనే ఆకలితో బాధపడేవారు భారత్‌ లోనే అత్యధికంగా వున్నారని... ప్రపంచ ఆకలి సూచీ సైతం చెబుతోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవడం... కోట్లాది మందిని దరిద్రులుగా మార్చింది. ఆకలి మంటల్లోకి నెట్టింది. ఈ ఆర్థిక సంక్షోభం ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఎలా నిర్మించగలుగుతుంది?
సమాజం కొత్త భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలంటే... మంచి ఆరోగ్యానికి అనుకూలమైన జీవన పరిస్థితులు, పని పరిస్థితులు కల్పించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య అసమానతలను రూపుమాపి, నాణ్యమైన ఆరోగ్యవంతమైన సేవలను అందించాలి. అది ప్రభుత్వం బాధ్యత. అయితే ప్రభుత్వం ఆ బాధ్యత నుండి తప్పుకుంది. సంక్షోభ సమయంలో అండగా నిలవాల్సిన కేంద్రప్రభుత్వం... ప్రజలపై రకరకాల రూపంలో పన్నుల భారాలను మోపింది. దేశానికి వెన్నెముకలా వుండే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. ఆరోగ్య సేవలను సైతం నామమాత్రం చేసింది. ప్రజల్లో కరోనా భయాన్ని పోగొట్టలేకపోయింది. ఇవి ఆరోగ్యవంతమైన సమాజానికి సంకేతాలు కావు. ఉపాధి, ఆహారం, ఆరోగ్యం... ప్రజలకు అందుబాటులో వుండాలి. ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం దిశగా పురోగమించగలం.