Apr 19,2023 23:03

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: ఆరోగ్యకరమైన అలవాట్లతో కాలేయాన్ని కాపాడుకోవచ్చని కామినేని హాస్పటల్స్‌ సీనియర్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్‌ వంశీ చైతన్య గూడే అన్నారు. తాడిగడపలోని కామినేని హాస్పటల్స్‌ నందు బుదవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 19వ ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా వివిధ అవగాహనా కార్యక్రమాలను తమ హాస్పటల్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. మెదడు తరువాత కాలేయం మన శరీరంలోని అతి పెద్ద అవయవం అన్నారు. మనం తినే, తాగే, వేసుకునే మందులు కూడా చివరకు కాలేయం గుండా ప్రయాణిస్తాయన్నారు. జీర్ణమైన ఆహార పదార్థాలు కరిగి కలసిపోయిన మందులతో కూడిన రక్తాన్ని జాగ్రత్తగా వడబోసే కాలేయం దానిలో ప్రమాదకర రసాయనాలను తొలగిస్తుందన్నారు. ఇన్పెక్షన్లతో పోరాడుతుందన్నారు. రక్తంలో చక్కెర శాతాన్ని క్రమబద్దం చేసుతందని, కొలెస్ట్రాల్‌ శాతం అదుపు చేస్తుందన్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన మంచి ఆరోగ్యం కాపాడుకోవచ్చని తెలిపారు. కాలేయ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడంతో పాటు ముందుగా ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కామినేని హాస్పటల్స్‌ సీవోవో డాక్టర్‌ నవీన్‌ కుమార్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ ఎన్‌.వి. పవన్‌ ఈశ్వర్‌ పలువురు వైద్యులు పాల్గొన్నారు.