Nov 15,2022 22:40

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
        సమాజంలో హానికర ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములమవుదామని కమిషనర్‌ షేక్‌ షాహిద్‌ తెలిపారు. స్థానిక సిఆర్‌ఆర్‌ కళాశాల ఆడిటోరియంలో హానికర ప్లాస్టిక్‌ దుష్ప్రభావాలపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కమిషనర్‌ షాహిద్‌ మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు, ప్రత్యామ్నాయ వస్తువుల వాడకంపై ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరంతరాయంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్య, పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత నగర అభివృద్ధికి నగరపాలక సంస్థ, గ్రామదీప్‌ స్వచ్ఛంద సంస్థ కలిసి పనిచేస్తున్నాయన్నారు. వ్యాపార, వాణిజ్య, హోటల్స్‌, వర్తక సంఘ వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ సంచుల స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. పేపర్‌, క్లాత్‌, జ్యూట్‌ వస్తువుల వినియోగం, వాడకంపై తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. క్వారీ బ్యాగులు హానికర ప్లాస్టిక్‌ వస్తువులను కాలువల్లో పడేయడం ద్వారా మైక్రో ప్లాస్టిక్‌ తయారై ఇటు జీవరాసులు అటు మానవులపై ప్రభావం ఏర్పడి అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల నీటి, వాయు కాలుష్యం ఏర్పడి థైరాయిడ్‌, గ్యాస్‌ కేన్సర్‌ వంటి పలు రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. ఇంటి వద్ద చెత్తను వేరు చేసేందుకు ప్రతి ఇంటికి మూడు రకాల డబ్బాలను అందించామన్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువుల వాడకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ప్రత్యామ్నాయ వస్తువులను వాడుకలోకి తెచ్చుకోవాలన్నారు. ముఖ్యంగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారం ఎన్‌జిటి ఆదేశాల ప్రకారం కాలుష్య రహిత నగరాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకోవాలని కమిషనర్‌ షాహిద్‌ పేర్కొన్నారు. అనంతరం నిషేధిత ప్లాస్టిక్‌ వాడుబోమని వ్యాపారులు, విద్యార్థులు, వినియోగదారులు, ఉపాధ్యాయులు, అధికారులతో కమిషనర్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ప్లాస్టిక్‌ నియంత్రణ అధికారి సిరాజ్‌, గ్రామదీప్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు డాక్టర్‌ మనోహరి, కార్పొరేషన్‌ హెల్త్‌ అధికారి గోపాల్‌ నాయక్‌, కళాశాల ప్రిన్సిపల్‌ అరుణ కుమారి, డాక్టర్‌ అచ్యుతరావు, డాక్టర్‌ ఎల్‌విఎస్‌.ప్రసాద్‌, వ్యాపార వర్తకసంఘ ప్రతినిధులు, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.