Jul 12,2021 15:51

చిన్నగా.. తియ్యని రుచి కల్గిన ఆప్రికాట్‌ పండులో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందించే ఆప్రికాట్‌తో వెరైటీ వంటలు మీకోసం

                                                                                 స్మూతీ

 స్మూతీ

కావాల్సిన పదార్థాలు :  నానబెట్టిన ఆప్రికాట్‌- కప్పు (లోపల విత్తనాలు తొలగించినవి), అరటి పండు- ఒకటి (మీడియం సైజు), బాదంపాలు- కప్పు, తేనె- టీస్పూను.
తయారుచేసే విధానం :

  • ముందుగా అరటిపండును చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి, మిక్సీ జారులో వేసుకోవాలి.
  • అందులోనే నానబెట్టిన ఆప్రికాట్‌లు, బాదంపాలను వేసి, కొంచెం నీళ్లు పోయాలి.
  • ఇప్పుడు అన్నింటినీ మిక్సీలో వేసి, గ్రైండ్‌ చేయాలి.
  • దానిని గాజుగ్లాసులోకి తీసుకొని, తేనె కలిపితే మరింత రుచిగా ఉంటుంది.



                                                                                స్వీట్‌ ఖుబానీ

  స్వీట్‌ ఖుబానీ

కావాల్సిన పదార్థాలు : ఖుబానీ (ఆప్రికాట్స్‌)- 200 గ్రాములు, చక్కెర - 75 గ్రాములు, రాస్పబెర్రి కలర్‌- 3 చుక్కలు, వెనీలా ఎసెన్స్‌ - 3 చుక్కలు, నీళ్ళు- తగినన్ని.
తయారుచేసే విధానం :

  • ముందుగా ఒక గిన్నెలో ఖుబానీలను వేసి, నిండా మునిగేట్టుగా నీళ్లు పోయాలి.
  • వాటిని నాలుగు గంటలు నానబెట్టాలి.
  • తర్వాత ఒక్కో ఖుబానీకి చాకుతో గాటు పెట్టి, లోపలున్న గింజను తీసేయాలి.
  • ఆ గింజలన్నింటినీ విరగ్గొట్టి లోపలున్న పప్పును నీళ్లల్లో వేసి ఉంచాలి.
  • వెడల్పాటి పాన్‌ తీసుకొని, అందులో నానిన ఖుబానీలను వేసి నీళ్లతో పాటు ఉడికించాలి.
  • అవి మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర వేసి, గరిటెతో కలుపుతూ ఉండాలి.
  • అది కరిగి చిక్కపడ్డాక యాలకుల పొడి వేసి, పక్కన పెట్టుకోవాలి.
  • అది చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ ఖుబానీ కా మీఠాను క్రీమ్‌, కస్టర్డ్‌ (ఓ రకమైన పాల తీపి వంటకం), ఐస్‌క్రీమ్‌కి మంచి కాంబినేషన్‌.
  • నానపెట్టిన ఖుబానీ గింజలు పొట్టు తీసి సన్నగా కట్‌ చేసి పైన అలంకరిస్తే చూడటానికి చాలా బాగుంటుంది.

                                                                                      హల్వా

హల్వా

కావాల్సిన పదార్థాలు :  నానబెట్టిన ఆప్రికాట్‌లు - 200 గ్రాములు, పంచదార- అరకప్పు, డ్రైఫ్రూట్స్‌- కొద్దిగా, నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి- చిటికెడు.
తయారుచేసే విధానం :

  • ముందుగా ఆప్రికాట్‌లను 4 లేదా 5 గంటలు నానబెట్టాలి. వాటిని మిక్సీలో మెత్తగా వేసుకొని, ఒక బౌల్‌లో పక్కన పెట్టుకోవాలి.
  • ఒక పాన్‌ తీసుకొని, నెయ్యి వేసుకోవాలి. అందులో డ్రైఫ్రూట్స్‌ని వేసి, చిన్నమంటపై బంగారు వర్ణం వచ్చేవరకూ వేగనిచ్చి, పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్‌లో ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఆప్రికాట్‌ మిశ్రమాన్ని వేసుకోవాలి. అందులో పంచదార, యాలకుల పొడి వేసి, మిశ్రమం బాగా దగ్గరయ్యే వరకూ కలియబెడుతూ ఉండాలి.
  • తర్వాత దానిని ఒక బౌల్‌లోకి తీసుకుని, ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే ఆప్రికాట్‌ హల్వా రెడీ.

                                                                                 ఐస్‌క్రీం

ఐస్‌క్రీం

కావాల్సిన పదార్థాలు : ఆప్రికాట్‌లు - నాలుగు (ఎండినవి), పెరుగు - కప్పు, జున్ను- అరకప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - తగినంత.
తయారుచేసే విధానం :

  • స్టవ్‌పై ఒక పాన్‌పెట్టి, కొన్ని నీళ్లు పోయాలి. అందులో ఆప్రికాట్‌లు వేసి 20 నిమిషాల పాటు చిన్నమంటపై ఉడికించి, పక్కన పెట్టుకోవాలి.
  • చల్లారిన తరువాత వాటిల్లోని గింజలు వేరుచేసి, మిక్సీలో మెత్తగా అయ్యే వరకూ వేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  • అందులోనే పెరుగు, జున్ను, నిమ్మరసం, తగినంత పంచదార వేసి బాగా కలియబెట్టాలి.
  • దానిని మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి, తీయాలి. దీన్ని చల్లగా తింటే బాగుంటుంది.