Jul 01,2023 21:46

ఆరోగ్యానికి శారీరక శ్రమ చాలా అవసరం

ప్రొద్దుటూరు : ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే శారీరక శ్రమ ఎంతో అవసరమని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ టి.డి.వరుణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో యుక్త వయసులోనే గుండె జబ్బుల వ్యాది రావడం విచారకరమన్నారు. ఇం దుకు అనేక కారణాలని ఆయన వివరించారు. వంశ పారంపర్యం, వయసు, మద్యపానం, ధూమ పానం, ఉబకాయం, శారీరక శ్రమలేకపోవడం, రక్తపోటు, మధుమేహం, వత్తిడి అని తెలిపారు. మొదటి రెండు కారణాలు మన చేతుల్లో లేక పోయినప్పటికీ మిగిలిన వాటికి మన తప్పిదమే కారణమవుతుందన్నారు. వీటి వల్ల రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. రక్తనాళాల వల్ల రక్త ప్రసరణ జరిగి మనిషి ఆరోగ్యంగా ఉంటారన్నారు. రక్తనాళాలు సరిగా పనిచేయకపోవడంతో గుండెపోటు, పక్ష వాతం, కిడ్నీలు పనిచేయకపోవడం, కంటిచూపు మందగించడం వంటి వ్యాధులొస్తాయన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడంతో జబ్బులకు దారి తీస్తుందన్నారు. ప్రతిరోజు దాదాపు ఒక గంట పాటు శారీరకశ్రమ అవసర మన్నారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలన్నారు. నడక ఒక మంచి వ్యాయామమని పేర్కొన్నారు. నడక వల్ల ఒత్తిడి కూడా దూరమవుతుందన్నారు. మనం తీసుకునే ఆహరంలో రసాయనాలు కలవడం వల్ల క్యాన్సర్‌ వ్యాది óవచ్చే అవకాశం ఉందన్నారు. మన ఇంట్లో వండే ఆహారానికి అధిక ప్రాదాన్యత ఇవ్వాల న్నారు. మాంసాహారం మితంగా ఉండాలన్నారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. వీలైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు. ఒకసారి అనారోగ్యానికి గురైతే అన్ని రకాలుగా నష్టపోతామని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి, ఆనందం మన పాదాల దగ్గరే ఉంటుందన్నారు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్న మన పెద్దలు చెప్పిన నానుడిని దృష్టిలో ఉంచుకొని సుఖంగా జీవించాలని డాక్టర్‌ టిడి వరుణ్‌కుమార్‌ తెలిపారు.డాక్టర్‌ టిడి వరుణ్‌కుమార్‌రెడ్డి