ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలని మనందరికీ తెలిసిందే. అయితే ఆకు కూరల్లో బచ్చలికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే బచ్చలిలో.. అనేక విటమిన్లు, పీచుపదార్థాలు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. బచ్చలి రెటీనా సమస్యలు తగ్గించడానికి, మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి ఎంతో దోహదపడుతుంది. మరిలాంటి బచ్చలితో ఎలాంటి వెరైటీలు చేసుకోవాలో తెలుసుకుందాం..
పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్థాలు : నూనె -2 టీ స్పూన్లు, మెంతులు-1/4 టీస్పూన్, ఆవాలు-1/2 టీస్పూన్, జీలకర్ర-టీ స్పూన్, ఉల్లిపాయలు-కప్పు (తరిగినవి), ఉప్పు-రుచికి తగినంత, కరివేపాకు-రెండు రెబ్బలు, పచ్చిమిర్చి-నాలుగు (తరిగినవి), అల్లం-టీ స్పూన్, వెల్లుల్లి-టీ స్పూన్, పసుపు-1/4 టీ స్పూన్, బచ్చలికూర-కట్ట (తరిగినది), టమాటా-1/2 కప్పు, పుట్నాలు-1 1/2 టీ స్పూన్ (పొడి), పెరుగు-కప్పు, జీలకర పొడి-1/2 టీ స్పూన్ (రోస్టెడ్), కొత్తిమీర తురుము-టీ స్పూన్, నీళ్లు-కప్పు.
తయారుచేసే విధానం : ముందుగా స్టౌపై పాన్ పెట్టి, నూనె వేసి వేడెక్కనివ్వాలి.
- ఇందులో మెంతులు, ఆవాలు, జీలకర వేసి బాగా వేగనివ్వాలి.
- ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
- ఇందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, పసుపు వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు తరిగిపెట్టుకున్న బచ్చలికూర, టమాటా ముక్కలు వేసి కలుపుకుని, మూత పెట్టుకోవాలి.
- మూడు నిమిషాలు మగ్గాక నీళ్లు పోసుకోవాలి.
- పుట్నాల పొడిలో పెరుగు వేసి, బాగా బ్లెండ్ చేసుకోవాలి.
- తర్వాత మూతపెట్టి కొద్దిసేపు మరగనివ్వాలి.
- చిక్కబడ్డాక కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే రుచికరమైన బచ్చలికూర పెరుగు పచ్చడి రెడీ.
రైస్
కావాల్సిన పదార్థాలు : ఆయిల్-6 టీస్పూన్లు, జీడిపప్పులు-6, ఎండుమిర్చి-4, బచ్చలాకు-కట్ట (తరిగినది), చెక్క-చిన్న ముక్క, లవంగ-నాలుగు, బిర్యానీ ఆకు- కొద్దిగా, జీలకర-1/2 టీ స్పూను, మెంతులు-1/4 టీ స్పూను, పచ్చిమిర్చి-నాలుగు, ఉల్లిపాయ ముక్కలు-కప్పు, టమాటా ముక్కలు-కప్పు, పసుపు-1/2 టీస్పూన్, కొబ్బరితురుము-2 టీ స్పూన్లు, ధనియాల పొడి-1/2 టీ స్పూన్.
తయారుచేసే విధానం : ముందుగా పాన్ పెట్టుకుని, నూనె వేసి వేడెక్కనివ్వాలి.
- ఇందులో జీడిపప్పులు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
- ఇందులో బచ్చలాకు వేసి; నీరు మొత్తం ఇంకిపోయేలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
- మరోపాన్‌లో నూనె పోసి, ఇందులో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.
- ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి.
- తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి.
- ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమంలో కొబ్బరి వేసి, మిక్సీ పట్టుకోవాలి.
- ఈ పేస్టుని పాన్‌లో ఉన్న మిశ్రమానికి జత చేసి, వేపుకోవాలి.
- తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే వేడివేడి.. స్పైసీ.. స్పైసీ బచ్చలి రైస్ రెడీ!
చేపలు
కావాల్సిన పదార్థాలు : బచ్చలికూర-2 కప్పులు, చేపముక్కలు-1/4 కిలో, ఉల్లిపాయ-ఒకటి, పచ్చిమిర్చి-2(తరిగినవి), కారం-తగినంత, ఉప్పు-తగినంత, జీలకర్రపొడి-టీస్పూన్, అల్లంవెల్లుల్లి-టీస్పూన్, కొత్తిమీర-కొద్దిగా, పసుపు-చిటికెడు, ధనియాలపొడి-టీస్పూన్, గరం మసాలా-టీస్పూన్, పోపుదినుసుల-టీస్పూన్, నూనె-3టీస్పూన్లు.
తయారుచేసే విధానం : ముందుగా పాన్‌పెట్టుకుని, నూనె పోసి వేడెక్కనివ్వాలి.
- ఇందులో జీలకర్ర వేసి, ఉల్లిపాయముక్కలు, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి.
- తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి.
- ఇందులో కొద్దిగా కారం, పసుపు, ధనియాలపొడి, జిలకర్రపొడి వేసి బాగా కలపాలి.
- వేగాక కొద్దిగా నీరు పోయాలి.
- ఇందులో బచ్చలికూర వేసుకుని కలుపుకోవాలి.
- అలా కొద్దిసేపు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.
- రుచికి కొద్దిగా ఉప్పు వేసుకుని, ఇందులో చేపముక్కలు వేసి మూత పెట్టాలి.
- ఐదునిమిషాలు మగ్గిన తర్వాత, జాగ్రత్తగా కలుపుకోవాలి.
- దీన్ని గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
- అంతే రుచికరమైన బచ్చలికూర చేపలు రెడీ..