ఈ మాసంలోనే చింత చెట్టు చిగురులు వేస్తుంది. ఈ చింత చిగురులో సి విటమిన్ మెండు. అంతేకాదు చింత చిగురు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.
పచ్చడి
కావాల్సిన పదార్థాలు : చింతచిగురు- కప్పు, తాజా కొబ్బరి ముక్కలు- కప్పు, పసుపు- పావుస్పూను, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి- అయిదు, ఎండుమిర్చి- ఏడు, ఆవాలు- అరస్పూను, మినపప్పు- స్పూను, మెంతులు- కొద్దిగా, ఇంగువ- చిటికెడు, నూనె- మూడు స్పూనులు.
తయారు చేసే విధానం :
స్టౌమీద పాన్ పెట్టి నూనె వేయాలి.
అది వేడయ్యాక చింత చిగురు, కొబ్బరి ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని ఎర్రగా వేయించుకుని స్టౌ కట్టేయాలి.
తాలింపు వేడి చల్లారాక మిక్సీలో వేసుకోవాలి.
అందులోనే మిగిలిన పదార్థాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
పొడి
కావాల్సిన పదార్థాలు : చింతచిగురు - కప్పు, నూనె - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - రెండు, వేరుశనగ పప్పులు - నాలుగు టీ స్పూన్లు, శనగపప్పు - రెండు టీ స్పూన్లు, ఎండుమిర్చి - ఎనిమిది, ధనియాలు - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం :
చింత చిగురును శుభ్రం చేసి, నీళ్లలో బాగా కడగాలి. తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి.
స్టౌమీద పాన్ పెట్టి, నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక వెల్లుల్లి రేకలు వేసి పచ్చి వాసన పోయే వరకూ వేగించాలి.
పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి రెండు నిమిషాలు వేగించాలి.
చివరగా ధనియాలు జత చేసి వేగించి దింపి, చల్లార్చాలి.
మరలా అదే పాన్‌లో కొద్దిగా నూనె వేయాలి. వేడయ్యాక అందులో నీడలో ఆరబెట్టుకున్న చింతచిగురు వేసి పొడి పొడిలాడే వరకూ వేగించి, దించేయాలి.
మిక్సీలో ముందుగా వేగించి ఉంచుకున్న పప్పులు, ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అందులోనే వేగించి ఉంచుకున్న వెల్లుల్లి, చింతచిగురు జత చేసి, మరోమారు తిప్పి పొడి చేసుకోవాలి.
వేడి వేడి అన్నంలో, నెయ్యి జత చేసుకుని తింటే రుచిగా ఉంటుంది.
పచ్చిరొయ్యలతో..
కావాల్సిన పదార్థాలు : చింతచిగురు - కప్పు, పెద్ద రొయ్యలు - పావు కిలో, ధనియాల పొడి - స్పూను, జీలకర్ర పొడి - అరస్పూను, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - కట్ట, వెల్లుల్లి రేకలు - ఐదు, నూనె - సరిపడా, గసగసాల పొడి - స్పూను, దాల్చిన చెక్క పొడి - అరస్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - ఐదు, కారం - తగినంత.
తయారుచేసే విధానం :
ముందుగా రొయ్యలని శుభ్రం చేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వాటికి పట్టేట్టుగా కలిపి పెట్టుకోవాలి.
పాన్‌లో నూనెవేసి అది బాగా వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేగించుకోవాలి.
ఉల్లిముక్కలు వేగాక అందులో రొయ్యలు వేసుకోవాలి. ఆపై రొయ్యలు పచ్చివాసన పోయేవరకూ వేగించుకోవాలి. తర్వాత కాసిన్ని నీళ్లు పోసి, మూతపెట్టి మరికాసేపు ఉడికించుకోవాలి.
రొయ్యలు ఉడికాక గసగసాల పొడి, జీలకర్ర పొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని, చింతచిగురు వేసుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి.
చివరగా కొత్తిమీరతో అలంకరిస్తే సరిపోతుంది. అంతే చింతచిగురు రొయ్యల కూర రెడీ.
మెత్తళ్లతో..
కావాల్సిన పదార్థాలు : మెత్తళ్లు (ఎండు చిన్నచేపలు) - ఒక కప్పు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం - టీస్పూను, నూనె - సరిపడా, చింతచిగురు - 200 గ్రాములు, కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా
తయారుచేసే విధానం :
స్టౌమీద పాన్ పెట్టి, మెత్తళ్లను వేపుకోవాలి. కొద్దిగా వేగాక, వాటిని నీటిలో వేసి శుభ్రం చేసి పక్కనపెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్‌లో నూనె వేసి, అది కాస్త వేడయ్యాక తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి వేయాలి.
తర్వాత చేపలు వేయాలి. పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు కూడా వేయాలి.
అయిదు నిమిషాలు ఉడికిన తర్వాత, శుభ్రం చేసుకున్న చింతచిగురును నలిపి, వేయాలి. చివరిలో కొత్తిమీర సన్నగా తరిగి వేయాలి.(తప్పనిసరి కాదు)