Sep 16,2023 21:21

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు

ప్రజాశక్తి-విజయనగరం : ప్రతిఒక్కరి ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలను నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి వెంటనే ఉచితంగా మందులు అందజేయాలని ఆదేశించారు. శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధిపై శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయం, నీటిపారుదల, వైద్యారోగ్యం, గృహనిర్మాణం, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్తు, డ్వామా, ఆర్‌అండ్‌బి తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ముత్యాలనాయుడు మాట్లాడుతూ డెంగీ, మలేరియా తదితర సీజనల్‌ వ్యాధులపై దృష్టి పెట్టాలన్నారు. వైద్యారోగ్యశాఖ, పంచాయతీ శాఖలు సమన్వయంతో తక్షణమే స్ప్రేయింగ్‌, బ్లీచింగ్‌ నిర్వహించాలని సూచించారు. ప్రజలను జల్లెడపట్టి, వ్యాధులను గుర్తించి, వాటికి సమర్థవంతమైన చికిత్స అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇంటింటికీ సర్వే చేసి, ఏడు రకాల పరీక్షలను నిర్వహించి వ్యాధులను నిర్ధారించిన తరువాత, ఈ నెల 30 నుంచి ఆరోగ్య శిబిరాలలో స్పెషలిస్టు వైద్యుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని సుమారు 17 లక్షల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
వ్యవసాయశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా, జిల్లాలో వంద శాతం ఇ-క్రాప్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమం కింద మంజూరైన విద్యుత్తు పనులన్నిటినీ, వేరే పథకాల కింద నిర్వహించాలని సూచించారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర పనులన్నిటినీ సత్వరమే పూర్తి చేయాలని, బిల్లులకు సమస్య లేదని స్పష్టం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లను అక్టోబరు నెలాఖరికి పూర్తిచేసి, ప్రారంభించాలని ఆదేశించారు.
అనంతరం జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ సొంత స్థలాలు ఉండి ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో ఇళ్లు మంజూరు చేస్తామని, దీనికోసం అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, సమస్యలను వివరించారు. జిజిఎంపి కింద ఆర్‌డబ్ల్యుఎస్‌ ద్వారా సుమారు రూ.1.70 కోట్ల పనులు పూర్తి చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.17 లక్షలు బిల్లులు మాత్రమే విడుదల కావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధాన జంక్షన్లలో రహదారులు గోతులు పడ్డాయని, వీటి మరమ్మతు పనులను వెంటనే నిర్వహించాలని కోరారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద లేఅవుట్ల అభివృద్దికి చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, సిపిఒ పి.బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.