రాయచోటి : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా, ప్రత్యేక ప్రధాన్యతతో నిర్వహించాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి నిర్వహించిన విసికి కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హల్ నుంచి కలెక్టర్ గిరీష, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సిఎం విసి ముగిసిన అనంతరం ఆయన అందించిన మార్గదర్శకాల మేరకు వైద్యాధికారులు, సంబందిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30 తేదీన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 15వ తేదీ నుంచి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లు పంపిణీ చేయాలన్నారు. 16వ తేదీ నుంచి ఏఎన్‌ఎంలు, సిహెచ్వోలు ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి వారిని వైద్య శిబిరాలకు పంపించాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు వరం లాంటిదని వైద్య అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వైద్యులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ క్యాంపులో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులో పాల్గొనడం జరుగుతుందన్నారు. వైద్యులు రోగులను ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేసేటప్పుడు పేషెంట్ వివరాలు ఆరోగ్యశ్రీ యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే, సర్పంచ్ ఇతర ప్రజా ప్రతినిధులు అందరినీ ఆహ్వానించి భాగస్వామ్యం చేయాలన్నారు. క్యాంపు నిర్వహించే గ్రామాలలో ఒక రోజు ముందే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అదనంగా వైద్య సిబ్బంది కోసం నర్సింగ్ కళాశాలల విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని డిఎంహెచ్‌ఒను ఆదేశించారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి పైలట్ క్యాంపును ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య, అంగన్వాడీ, విద్యాశాఖ, పంచాయతీరాజ్ తదితర అనుబంధ శాఖల అధికారులు విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందటం ఎలా అనే బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఐసిడిఎస్ అధికారి ఎం.ధనలక్ష్మి, జిల్లాలోని సిడిపిపిలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.










