
ప్రజాశక్తి - రేపల్లె
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆశయంతో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఆర్‌డిఒ హేల షారోన్ అన్నారు. పట్టణంలోని అయోవా హైస్కూల్‌లో గురువారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్షా శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఓపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిబిరంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, వైద్య సేవల కోసం వస్తున్న ప్రజలకు అందిస్తున్న మందులు, ఇతర సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు అందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలనేది సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయం అన్నారు. ఏ ఒక్కరు అనారోగ్యంతో బాద పడకూడదనే మంచి మనస్సుతో వైద్యులు ప్రజల వద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని గుర్తించి ఆరోగ్య శ్రీ క్రింద వైద్య మెరుగైన వైద్యం చేయిస్తామని అన్నారు. ఆరోగ్య సురక్షా సేవలు ఉపయోగించుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దారు మల్లిఖార్జునరావు, మున్సిపల్ కమిషనర్ విజయ సారధి పాల్గొన్నారు.