
ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
మండలంలోని బల్లిపాడులో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని జిల్లా కలెక్టరు ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ క్యాంపు రూమ్‌లు, కంప్యూటర్ డేటా సెంటర్‌ను ఆమె పరిశీలించారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, ఓపి రిజిష్ట్రేషన్, స్పాట్ రిజిష్ట్రేషన్, ఐటి రూమ్, వైద్యుల కేటాయింపు, ల్యాబ్, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ సహాయ కేంద్రం, వైద్యుల గదులు, మందుల కౌంటర్, న్యూట్రిషన్ స్టాల్, కంటి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. అక్కడకు వచ్చిన పేషంట్లతో కలెక్టరు మాట్లాడారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. నాణ్యమైన వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ అందాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు ఉచితంగా అందజేసి, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి.మహేశ్వరరావు, తహశీల్దార్ సిహెచ్ పెద్దిరాజు, ఎంపిడిఒ ఎస్.వెంకటేశ్వరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
మొగల్తూరు:ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం చేరువు చేసేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. కొత్తట గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీలు ప్రదర్శించిన పౌష్టికాహార కేంద్రాన్ని, ఎఎన్‌ఎంల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచి పడవల సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ, వైస్ ఎంపిపి కైలా సుబ్బారావు, ఎంపిటిసి లింగం ఏసుబాబు, కవురు సీతామాలక్ష్మి, కర్రి ఏసుబాబు పాల్గొన్నారు.
డ్వాక్రా మహిళల ఆర్థికంగా బలోపేతం చెందాలి
డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. కొత్తటలోని రైతు భరోసా కేంద్రంలో గురువారం మహిళా సమైక్య సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న భరోసాతో మహిళలు ఆర్థికంగా మరింత బలపడాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సున్నా వడ్డీ అమ్మఒడి ఆసరా తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన అయ్యేలా తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు తిరుమాని బాపూజీ, వైస్ ఎంపిపి కైలా సుబ్బారావు, కర్రి ఏసుబాబు, కౌరు సీతామాలక్ష్మి పాల్గొన్నారు.
పెనుమంట్ర:జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిరుపేదలకు అందుబాటులో ఉంటుందని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. మార్టేరు బసంతిదేవి బాలికల హైస్కూల్ గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, సర్పంచి మట్టా కుమారి, ఉప సర్పంచి కర్రి వేణుబాబు, డాక్టర్ కె.కార్తీక్ పాల్గొన్నారు.
ఉండి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెరుకువాడ గ్రామ సర్పంచి కొండవీటి సాంబశివరావు అన్నారు. చెరుకువాడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో సర్పంచి కొండవీటి సాంబశివరావు మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ జగనన్న ఆరోగ్య సురక్ష ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెన్మెత్స ఆంజనేయరాజు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొర్రపాటి అనిత, జగనన్న ఆరోగ్య సురక్ష మండల కన్వీనర్ బులుసు వెంకట రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.
గణపవరం : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని స్థానికులు వినియోగించుకోవాలని ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి అన్నారు. గురువారం సిహెచ్ అగ్రహారంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సభకు గ్రామ సర్పంచి చుక్కా అప్పారావు అధ్యక్షత వహించారు. సభలో జ్యోతిర్మయి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్థానికులకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తోందన్నారు. శిబిరంలో 306 మందికి వైద్య సేవలందించారు. కార్యక్రమంలో గణపవరం పిహెచ్‌సి డాక్టర్ పి.కిరణ్మయి, పిప్పర పిహెచ్‌సి డాక్టర్ తహశీల్దార్ పి.లక్ష్మి, ఇఒపిఆర్‌డి పివి.సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆచంట : జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం అని వైసిపి ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. గురువారం కోడేరులో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ రంగనాథరాజు పాల్గొని మాట్లాడారు. పేదలు ఆరోగ్యంగా జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలోనూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైౖర్మన్ చిల్లే లావణ్య, సర్పంచులు సీతారాం, చంటి, విజయలక్ష్మి, వైద్యాధికారులు పాల్గొన్నారు.
పెనుగొండ : జగనన్న ఆరోగ్య సురక్ష పేదల పాలిట వరమని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మండలంలోని నడిపూడి. చింతలపాలెం ఎంపియుపి స్కూల్‌లో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రజలను పూర్తి ఆరోగ్యవంతులుగా చేయడమే ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఆచంట నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాట్టి షర్మిలారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి ముందుకే వైద్యాన్ని అందించడానికి వినూత్నంగా, దేశానికి దిక్సూచిగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. సిద్ధాంతం పిహెచ్‌సి డాక్టర్ బి.పావని, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ నారాయణరావు, డాక్టర్ ఉమా శంకర్ 500 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.కార్యక్రమంలో నడిపూడి గ్రామ సర్పంచి కడలి బేబీ అన్నపూర్ణ, ఎంపిపి పూతినీడి వెంకటేశ్వరరావు (పెద్ద), కేశవరపు గణపతి, నడిపూడి పూరీల శ్రీను పాల్గొన్నారు.
వీరవాసరం : జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రాయకుదురులో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని గురువారం ఎంఎల్‌ఎ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం లోతట్టుగా ఉన్నందున దాన్ని మెరక చేయాలంటూ పలువురు ఎంఎల్‌ఎకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి గెడ్డం భారతి, ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గొలగాని సత్యనారాయణ, వైసిపి మండల కన్వీనర్ కడలి ధర్మారావు పాల్గొన్నారు.