ప్రజాశక్తి - పార్వతీపురం : ఆరోగ్య సురక్ష శిబిరాలకు సిద్ధం కావాలని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి.రమేష్ సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ బి.జగన్నాథరావుతో కలిసి జిల్లాలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఈనెల 30న ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి జిల్లాలో గల ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ఒలు ప్రతి గ్రామంలో ముందుగా చేయాల్సిన స్క్రీనింగ్ గురించి దిశా నిర్దేశం చేశారు. ఈనెల 30నుంచి జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌లకు కావాల్సిన సన్నాహక చర్యలు ముందుగానే చేపట్టాలని ఆదేశించారు. ప్రజలంతా ఈ క్యాంపులను వినియోగించుకొనేలా అవగాహన పెంచాలని సూచించారు.
క్షయ రోగ నిర్ధారణలో జాప్యం ఉండరాదు
క్షయ రోగ నిర్ధారణలో జాప్యం ఉండరాదని జాయింట్ డైరెక్టర్ ఆదేశించారు. జిల్లా క్షయ నివారణ విభాగంతో సమీక్ష నిర్వహించి క్షయ రోగ నిర్ధారణలో జాప్యం లేకుండా చూసుకోవాలని, అలాగే ప్రతి క్షయ రోగి మందులు తప్పని సరిగా వాడేలా చూడాలని అన్నారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో తప్పని సరిగా కల్లే పరీక్ష జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ డి.భాస్కరరావు, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ జగన్‌మోహన్‌రావు, డాక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.










