Sep 30,2023 19:59

వృద్ధుడికి కళ్లద్దాలు పెడుతున్న రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-గరివిడి :  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య డేటా సేకరిస్తామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా, రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలను నమోదు చేసి, అవసరమైన వారందరికీ వైద్యం అందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. గరివిడి మండలం చుక్కవలస గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ల్యాబ్‌లో స్వయంగా సుగర్‌ పరీక్ష చేయించుకున్నారు. రోగులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని సుమారు కోటి, 63 లక్షల కుటుంబాల్లోని దాదాపు ఐదు కోట్ల మందికి చెందిన ఆరోగ్య డేటాను సేకరిస్తున్నామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వారందరికీ ఆరోగ్య, వైద్య పరీక్షలను నిర్వహించి, మందులను ఉచితంగా అందజేసి, ఇంకా మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఇతర ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తామని తెలిపారు. నవంబరు 15 లోపల రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని సచివాలయాల పరిధిలో శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఒక ఆరోగ్య గుర్తింపు సంఖ్యను కేటాయించి, వారి వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నా మన్నారు. హెల్త్‌ ప్రొఫైల్‌లో వారి వివరాలను నమోదు చేసి, అవసరమైన వారికి కేస్‌ షీట్లను రూపొందించినట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, నిర్ణీత సమయం కేటాయించి, వారికి వైద్యం అందిస్తామని తెలిపారు. పిహెచ్‌సి వైద్యులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ జ్యోత్స్నతోపాటు, స్పెషలిస్టు వైద్యులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డాక్టర్‌ త్రివేణి, డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ వినోద్‌ వర్ధన్‌ రెడ్డి రోగులను పరీక్షించారు. చుక్కవలస, కొండ శంభాం, బిజె పాలెం గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మందికి ఈ శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. కార్యక్రమంలో గరివిడి ఎంపిపి మీసాల విజయలక్ష్మి, జెడ్‌పిటిసి వాకాడ శ్రీనివాసరావు, ట్రైనీ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, ఆర్‌డిఒ ఎం.అప్పారావు, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ భాస్కరరావు, డిపిఓ నిర్మలాదేవి, జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి డాక్టర్‌ విశ్వేశ్వర్రావు, తాహశీల్దార్‌ తాడ్డి గోవింద, ఎంపిడిఒ జి.భాస్కరరావు, డాక్టర్‌ బొత్స సందీప్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.