ప్రజాశక్తి-విజయనగరంటౌన్, జామి : జగనన్న ఆరోగ్య సురక్ష కాంప్‌ల్లో ఆరోగ్య శ్రీ కింద రిఫర్ చేయవలసి వచ్చిన వారికి ఆరోగ్య మిత్రలను జత చెయ్యాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ జామి మండలం లోట్లపల్లి , విజయనగరం అరుంధతినగర్ మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను తనిఖీ చేశారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసిన పలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. రోగులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడుతూ ఏడు రకాల పరీక్షలను నిర్వహించి, హెల్త్ ప్రొఫైల్‌లో వారి వివరాలను నమోదు చేయాలని, అవసరమైన వారికి కేస్ షీట్లను అందించాలని తెలిపారు. శిబిరాల్లో ఇసిజితో సహా మొత్తం 14 రకాల పరీక్షలను నిర్వహించి, 105 రకాల మందులను ఉచితంగా ఇవ్వాలని తెలిపారు. కంటి పరీక్షలను కూడా నిర్వహించి, అవసరమైనవారికి ఉచితంగా కళ్లద్దాలను కూడా అందజేయాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున శిబిరాల వద్ద తాగునీరు, స్నాక్స్ వంటివి ఏర్పాటు చేయాలని, వచ్చిన వారిని వేగంగా పంపించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. విజయనగరం అరుంధతి నగర్ లో 47, 48, 49 సచివాలయాలకు చెందిన సుమారు 2 వేల మంది, లోట్లపల్లి శిబిరం లో 271 మంది తనిఖీలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఎంహెచ్‌ఒ డాక్టర్ భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీ రాములు నాయుడు, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ గౌరీశంకర్, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ అప్పలరాజు, జామి ఎంపిడిఒ సతీష్, తహశీల్దారు హేమంత్ కుమార్, వైద్యులు, ప్రజా ప్రతినిధులు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.










