Sep 23,2023 21:53

వైద్య బందాలతో చర్చిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

      పుట్టపర్తి అర్బన్‌ : ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగస్వామ్యం కావాలని జిల్లా వైద్యాధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ అరుణ్‌బాబు సూచించారు. శనివారం నాడు కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐఎంఎ స్పెషలిస్ట్‌ డాక్టర్ల బందంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌వి.కృష్ణారెడ్డి, టిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ తిప్పేంద్ర నాయక్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ చెన్నారెడ్డి, డాక్టర్‌ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఐఎన్‌ఎ డాక్టర్ల బందం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ఈనెల 30 నుంచి అమలు కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో వైద్య కళాశాల కొరత ఉన్నందువల్ల ఐఎన్‌ఎ సహకారాలు వైద్య సేవలు అందించాలని కోరారు. ఇంటింటి సర్వే అనంతరం ప్రణాళిక బద్దంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హెల్త్‌ క్యాంపులలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలలో 64 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 72 రకాల మందులను ఉచితంగా అందజేస్తారని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న 1.18 లక్షల మందిని గుర్తించడం జరిగిందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైద్య నిపుణులు పాలుపంచుకోవాలని కోరారు. అనంతరం ఐఎన్‌ఎ స్పెషలిస్టు డాక్టర్ల బందం దీనిపై స్పందిస్తూ తమ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిటి బత్తలపల్లి హాస్పిటల్‌ మేనేజర్‌ పవన్‌ కుమార్‌, సత్యసాయి హాస్పిటల్‌ ప్రతినిధి డాక్టర్‌ భరత్‌, ఐఎన్‌ఎ ప్రతినిధులు డాక్టర్‌ ప్రసాద్‌ రెడ్డి, నరసింహారెడ్డి, సుప్రవీణ్‌, డాక్టర్‌ సౌకత్‌, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ వసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.