Jun 15,2023 00:37

ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి నాణ్యమైన వైద్య సేవలు అందడానికి ఎక్కువగా కృషి చేస్తున్న ఆశా వర్కర్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే పని ఒత్తిడి పెరగ్గా అధికారులు, వైద్యులు, అధికార పార్టీ నేతల వేధింపులు భరించలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇవి చాలవన్నట్లు భౌతిక దాడులకు గురవుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 3,200 మంది ఆశ కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖలో అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆశా కార్యకర్త స్థానికంగా నివాసం ఉంటూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. పిల్లలు, వద్ధులకు, గర్భిణులు, బాలింతలకు మందులు, టీకాలు, పౌష్టికాహారం ఇవ్వడం వంటి అనేక పనులు చేస్తున్నారు. సామాన్య ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే వైద్యం చేయించుకునేలా కషి చేస్తున్నారు. ఇలా అనేక సేవలు కొనసాగిస్తున్నారు.
భౌతిక దాడులతో బెంబేలు
ఆశ వర్కర్లతో ప్రభుత్వం అనేక రకాల సర్వేలు చేయిస్తోంది. అంతేకాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సందర్భాల్లో ఆశాలు భౌతిక దాడులకు గురవుతున్నారు. గతంలో పిఠాపురం మండలం విరవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని విరవ గ్రామంలో పని చేస్తున్న కుమారి అనే ఆశా కార్యకర్తపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి దాడి చేయడంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అగ్ని ప్రమాదంలో ఒక వృద్ధురాలు గాయాల పాలవ్వగా ఆమెను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో ఈ దాడి సంఘటన చోటు చేసుకుంది. ప్రతి నెలా 9న గర్భిణులకు వైద్య పరీక్షల కోసం మేళా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేటకు చెందిన ఒక గర్భిణిని వైద్య పరీక్షల కోసం రావాలని కోరగా వైసిపి కార్యకర్త కుమారి అనే స్థానిక ఆశా కార్యకర్తపై దాడికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన మరో ఆశా కార్యకర్త సత్యవతిపై వైసిపిలో తిరుగుతున్న ఒక వాలంటీర్‌ భర్త కారణం లేకుండానే దాడి చేసి గాయపరిచాడు. దీనిపై కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇటువంటి దాడులు పునరావతం కాకుండా అతన్ని హెచ్చరించి పంపించారు.
సెలవులు ఇవ్వకుండా వేధింపులు
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న ఆశా కార్యకర్తలపై అధికారులు తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మెటర్నటీ సెలవులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాన్పుల కోసం సెలవులు పెడుతుంటే విధుల నుంచి తొలగిస్తున్నారు. కాకినాడ అర్బన్‌లో శ్రీజ అనే ఆశ కార్యకర్త మెటర్నటీ లీవ్‌ తీసుకోగా అనంతరం కొంతకాలం పాటు ఆమెను విధుల్లోకి తీసుకోలేదు. చివరకు సిఐటియు నాయకులు ప్రశ్నించగా తిరిగి విధుల్లోకి తీసుకున్న పరిస్థితి. కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామానికి చెందిన శాంతారత్నం గర్భసంచి ఆపరేషన్‌ చేసుకోగా ఒక నెల రోజులు మాత్రమే సెలవు ఇవ్వగా రెండో నెలలో విధులకు హాజరు కావాల్సిందేనంటూ సబ్‌ సెంటర్‌ వైద్యురాలు హుకుం జారీ చేసారు. కాట్రావులపల్లి పిహెచ్సిలో పనిచేస్తున్న భవాని కాన్పు కోసం 6 నెలలు సెలవులో ఉండగా 3 నెలల వేతనంలో కోత విధించారు. ఇలా అనేక ఇబ్బందుల నడుమ ఆశా వర్కర్లు విధులు నిర్వర్తిస్తున్నారు.