Nov 21,2023 18:41

మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-నెల్లూరు : అంగన్వాడి కేంద్రం పరిధిలో గల గర్భవతులు, తల్లులు, 0-6 సంవత్సరాల వయస్సు పిల్లల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దష్టిసారించి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు కషి చేయాలని కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌, ఐసిడిఎస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ లో జిల్లా కలెక్టర్‌ హరి నారాయణన్‌, సిడిపిఓలు, అసిస్టెంట్‌ సిడిపిఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులు, తల్లులు, 0-6 సంవత్సరాల వయస్సు పిల్లల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలపై సెక్టార్‌ వారీగా, ప్రాజెక్ట్‌ వారీగా సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి అంగన్వాడి కేంద్రం పరిధిలో గల గర్భవతులు, తల్లులు, పిల్లల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ముఖ్యంగా రక్తహీనతగల గర్భవతులు, బాలింతలు, తక్కువ ఎత్తు, బరువు తక్కువ వున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. గర్భవతులు, బాలింతలు, పిల్లల్లో రక్త హీనత లేకుండా అవసరమైన పౌష్టికాహారం వారికి అందచేసేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు వివరాలు సంబందిత రిజిష్టర్స్‌, ఆన్‌ లైన్‌ నందు నమోదు చేయడంతో పాటు రిజిస్టర్స్‌ నిర్వహణ ఖచ్చితంగా వుండాలన్నారు. సమావేశంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హేన సుజన, సిడిపిఓ లు, అసిస్టెంట్‌ సిడిపిఓ లు తదితరులు పాల్గొన్నారు.