ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రజల ఆరోగ్య పరిరక్షణమే ధ్యేయంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. శుక్రవారం రాజీవ్ నగర్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 8, 9, 10, 33, 34 నెంబర్ల సచివాలయాల పరిధిలో ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. శుక్రవారం 800 మంది ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శిబిరాలను సందర్శించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. ఆరోగ్య శిబిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార వివరాలను వెల్లడించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లు జాకీర్ హుస్సేన్, దుప్పాడ సునీత, పొంతపల్లి మాలతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, జోనల్ ఇన్చార్జులు కోలగట్ల కష్ణారావు, బంగారు నాయుడు, రెడ్డి గురుమూర్తి, సహాయ కమిషనర్ ప్రసాదరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
ప్రజలే ప్రభుత్వానికి అండ
ప్రజలే ప్రభుత్వానికి అండ అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నగరంలోని పలు డివిజన్లకు సంబంధించిన క్లస్టర్ స్థాయి సమావేశం స్థానిక ఆర్య వైశ్య కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు.కోలగట్ల మాట్లాడుతూ.. ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి అంశంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికీ వెళ్లి గత ప్రభుత్వ పాలన వైఫల్యాలను.. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనపై ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి జగన్ ఏనాడూ ఆపలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని చెబుతూ ప్రజల వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లి ఓట్లు అడగగలరా? అని సవాల్ చేశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా కోలగట్ల అండగా ఉంటారని తెలిపారు. మరోసారి తనకు అవకాశమిస్తే ప్రజలు అడగడానికి సమస్యలు, తాము చేయడానికి పనులేవీ పెండింగ్ లో లేని విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గహ సారధులు పాల్గొన్నారు.










