ప్రజాశక్తి-గజపతినగరం, బొండపల్లి : రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనికోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల చెంతనే స్పెషలిస్టు వైద్యుల సేవలను అందిస్తున్నామని చెప్పారు. బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంత్రి బొత్స సందర్శించారు. ఒపి రిజిష్ట్రేషన్, డాక్టర్ల తనిఖీ గదులు, మందుల కౌంటర్ తదితర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ప్రతి ఇంటికీ వెళ్లి, వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని శిబిరాలకు రప్పించి వైద్యం, మందులను అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి తదుపరి పరీక్షల కోసం పెద్దాసుపత్రికి పంపించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. హెల్త్ ప్రొఫైల్ ఆధారంగానే వారికి జీవితాంతం వైద్యం అందిస్తామని తెలిపారు. అనంతరం వృద్దులకు కళ్లద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, మండల స్పెషల్ ఆఫీసర్ దుర్గాప్రసాద రావు, ఎంపిపి సిహెచ్ చల్లంనాయుడు, వైస్ ఎంపిపి జి.ఈశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు బివి ప్రభూజి, తాహశీల్దార్ ప్రసాదరావు, ఎంపిడిఒ రాజేంద్రప్రసాద్, సర్పంచులు ఎస్.ఆదినారాయణ, నడుపూరు భాస్కర్ నాయుడు, బి.ఈశ్వరరావు, ఎం.పైడిపు నాయుడు, పార్టీ నాయకులు ప్రభూజిరాజు, బొద్దల చిన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిర్వహణా లోపాలపై మంత్రి ఆగ్రహం
గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా న రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసు కున్నారు. రోగులకు హెల్త్ ప్రొఫైల్‌తోపాటు, సురక్ష సంచులను పంపిణీ చేయకపోవడంపై మండి పడ్డారు. కార్యక్రమంలో నిర్ధేశిత ప్రక్రియను పాటించడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని తాశిల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం పట్ల చిత్తశుద్ది, మానవతా భావం అవసరమని అన్నారు. నిర్లిప్తతను విడిచిపెట్టి, అంకితభావాన్ని చూపాలని, బాధ్యతాయుతంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఎంపిపి బెల్లాన జ్ఞానదర్శిని, జెడ్‌పిటిసి గార తవుడు, మండల ప్రత్యేకాధికారి రమేష్, తాహశీల్దార్ అరుణకుమారి, ఎంపిడిఒ కిషోర్ కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపిటిసిలు కళావతి, రాగలత, కార్యదర్శి జనార్ధన్, వైసిపి నాయకులు మండలి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రోగులకు స్పెషలిస్టు వైద్యులు డాక్టర్ అనూష, డాక్టర్ సాయికష్ణారెడ్డి, పిహెచ్‌సి వైద్యులు తనూజరారు, సుష్మిత వైద్యసేవలను అందించారు.










