ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ : మంగళగిరి గణపతి నగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఢిల్లీకి చెందిన నేషనల్ క్వాలిటీ ఎస్సూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్కాస్) బృందం శుక్రవారం సందర్శించింది. ప్రతినిధులు డాక్టర్ సంజీవరావు, డాక్టర్ స్వాతి లక్ష్మి హెల్త్ సెంటర్లోని 12 రకాల వైద్య ఆరోగ్య సౌకర్యాలను శుక్ర, శనివారాల్లో పరిశీలిస్తారు. శుక్రవారం మెడికల్ ఆఫీసర్ గది, లేబరేటరీల పరిశీలనతో ప్రారంభించారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.అనూష బృంంద ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హెల్త్ సెంటర్ పునాది వేసినప్పటి నుండి పూర్తిగా అభివృద్ధి చెందిన విధానం, హెల్త్ సెంటర్‌లోని వైద్యసేవలు, హెల్త్ సెంటర్ చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలు, హెల్త్ సెంటర్‌ను సందర్శించిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అధికారుల వివరాలను వివరించారు. హెల్త్ సెంటర్ ఆవరణలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన మలేరియా, లెప్రసీ, టీబీ, జాతీయ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను బృందం పరిశీలించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈ బృందం పరిశీలిస్తున్న తొలి ఆరోగ్య కేంద్రం ఇదే కావడం గమనార్హం. కార్యక్రమంలో ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి, స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ నరేంద్ర, జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ రాంప్రసాద్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ ఆఫీసర్ డాక్టర్ వాసుదేవరాజు, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎ.శ్రీమన్నారాయణ, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జోసెఫ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ పి.రత్నకుమారి పాల్గొన్నారు.










