Nov 01,2023 21:10

డిఎంహెచ్‌ఒ కొండయ్యకు వినతిపత్రం ఇస్తున్న ఆరోగ్య కార్యకర్తలు

మదనపల్లె అర్బన్‌: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ ఆరోగ్య కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్యకు యూనియన్‌ సభ్యులు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రెటరీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.లీలావతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖలో పనిచేసే ఎఎన్‌ఎంలు, సచివాలయ హెల్త్‌ సెక్రెటరీలు వారం రోజుల నుంచి 5 మంది విధులు నిర్వహిస్తున్న సమయంలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలపై ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సచివాలయం ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రెటరీలైన మహిళా ఉద్యోగులకు ఆన్‌లైన్‌ యాప్స్‌ వలన పనిభారం పెరిగి అధిక ఒత్తిడి గురవుతున్నారన్నారు. వారి ఆరోగ్యం దెబ్బతింటోందని, విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలపై ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసే ఆన్‌లైన్‌ యాప్స్‌ కుదించి పనిభారాన్ని తగ్గించాలని, యూనిఫామ్‌ అలవెన్స్‌, బయోమెట్రిక్‌ సడలింపు, అన్ని రకాల సెలవులు హెచ్‌ ఆర్‌ఎంఎస్‌ లాగిన్‌లో పొందుపరచాలనే విషయాలను పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని కోరి 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవ చేసే ఆరోగ్య కార్యకర్తల సమస్యలపై నిర్లక్ష్యం విడనాడి వారి సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఈ విషయాలపై ఉన్నతంగా ఆలోచించి ఈ ఆన్‌లైన్‌ యాప్స్‌ కుదించి పనిభారం పనిఒత్తిడి తగ్గించాలన్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ న్యాయమైనవని భావించి వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్పందిస్తూ మహిళా ఆరోగ్య కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.