Nov 03,2023 20:41

ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ శ్రీరాములునాయుడు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌ శ్రీ రాములునాయుడు అన్నారు. ఈ మేరకు ఈరోజు పిడబ్ల్యుడి భవనంలోనూ, రాజీవ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ లోను జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ఆయన సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందులు పంపిణీ ఏ విధంగా జరుగుతుందో గమనించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షులు ఆసపు వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ఆర్‌ శ్రీరాములనాయుడు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆరోగ్య శిబిరాలకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలకు రిఫర్‌ చేసే అవకాశం ఉందని అన్నారు. అనంతరం 25,26 నెంబర్‌ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతినెల మూడో తేదీన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా సచివాలయాల సందర్శనను చేపట్టారు. వాలంటీర్లు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించారు.యూజర్‌ చార్జీలు, కులాయి చార్జీలను వసూలు చేసే క్రమాన్ని గమనించారు. త్వరితిగతిన పన్ను వసూళ్లను చేపట్టాలని ఆదేశించారు.