Jul 02,2023 00:54

గుంటూరులో వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న జిల్లా వైద్యాధికారి శ్రావణబాబు, లక్ష్మణరావు

ప్రజాశక్తి-గుంటూరు : డాక్టర్స్‌డేను పురస్కరించుకొని ప్రజాశక్తి ఆధ్వర్యంలో గుంటూరు, బ్రాడీపేట 4/19లోని ది సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూలు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన వచ్చింది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ప్రజాశక్తి ఎడిటర్‌ తులసీదాస్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులతో కలిసి వైద్యశిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎ.శ్రావణబాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్స్‌డే సందర్భంగా ప్రజాశక్తి రూపొందించిన ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. ప్రజాశక్తి జిల్లా కన్వీనర్‌ బి.సుధాకిరణ్‌ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రావణబాబు మాట్లాడుతూ వైద్యునిగా, బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పనిచేసి, వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్‌ బిదాన్‌ చంద్రరారు జయంతిని డాక్టర్స్‌డేగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నిరంతరం వార్తారచన ద్వారా వెలుగులోకి తెస్తున్న ప్రజాశక్తి పత్రిక, సామాజిక బాధ్యతగా ఇటువంటి వైద్య శిబిరాన్ని నిర్వహించటం అభినందనీయమన్నారు. మన జీవన సరళిలో మార్పులు చేసుకుంటే చాలా వరకూ అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని, ప్రతి రోజూ నడక, పరిమితమైన, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. వైద్యం ప్రైవేటీకరణ అయిన నేపథ్యంలో రోగులకు వైద్యంపై నమ్మకం తగ్గుతోందని, కావున వైద్యులు సేవా దృక్పథాన్ని అలర్చుకోవాలని సూచించారు. అన్ని రకాల రోగాలకు ప్రభుత్వ రంగంలో ఒక క్రమపద్ధతిలో వైద్యం అందిస్తున్నామని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ కోవిడ్‌ సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యం అందించి, లక్షల మందిని కాపాడారని కొనియాడారు. గుంటూరుతోపాటు చుట్టుపక్కల పలు జిల్లాలకు జిజిహెచ్‌ వైద్యంలో అండగా ఉంటుందని, చివరి దశలో ఉన్న వారిని సైతం బతికిస్తున్న ఘనత వైద్యులకు దక్కుతుందన్నారు. వైద్యుల సేవలను గుర్తించి, ప్రజాశక్తి చేస్తున్న అభినందనీయమన్నారు. ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాస్‌ మాట్లాడుతూ డాక్టర్స్‌ డే నిర్వహించుకోవటం అంటే.. వైద్యులు వైద్య సేవలకు మరొకసారి పునరంకితం అయ్యే రోజని అన్నారు. క్లిష్ట సమయాల్లో ఉన్న రోగుల విషయంలో చికిత్స అనంతరం వైద్యులపై నిందలు, కొన్నిసార్లు భౌతిక దాడులు జరగటం బాధాకరమన్నారు. ప్రజలు ఆరోగ్య అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోగాన్ని ముందుగానే గుర్తించి, వైద్యులను సంప్రదిస్తే ప్రారంభంలోనే నివారించొచ్చన్నారు. ఈ క్రమంలోనే ప్రజాశక్తి సంస్థ సామాజిక బాధ్యతగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం డాక్టర్స్‌డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలన్నారు. ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంటే గుండె తదితర ఖరీదైన వైద్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు ఉచితంగా అందించవచ్చన్నారు. ది సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ రామన్‌ మాట్లాడుతూ ప్రజాశక్తి సామాజిక బాధ్యతగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి హాజరైన వైద్యులను అతిథులు సత్కరించారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్‌, స్థానిక శాఖ కార్యదర్శి ఎ.కల్యాణి, ప్రజాశక్తి సిటీ ఇన్‌ఛార్జి కె.సుధీర్‌, సిబ్బంది మూర్తి, ఖాజా, ప్రశాంత్‌, తేజ, శ్రీహరి పాల్గొన్నారు.
వైద్య శిబిరంలో నగరంలోని పలు ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్య నిపుణలు హాజరై ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెయిన్‌బో డయాగస్టిక్స్‌ వారు షుగర్‌ పరీక్షలు చేశారు. రమేష్‌ హాస్పిటల్‌ నుండి డాక్టర్‌ సందీప్‌, లలిత హాస్పిటల్‌ నుండి డాక్టర్‌ సిఎస్‌.రావు గుండెవ్యాధి పరీక్షలు చేశారు. జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో డాక్టర్‌ సేవా కుమార్‌, డాక్టర్‌ తేజ, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో డాక్టర్‌ వై.షేక్‌, చర్మవ్యాధుల డాక్టర్‌ బొంత శ్వేత, భవితా నేత్రాలయం కంటి వైద్యులు డాక్టర్‌ భవిత, చిన్నపిల్లల విభాగంలో డాక్టర్‌ సాయిప్రసాద్‌, డెంటల్‌ సిబార్‌ హాస్పిటల్‌ నుంచి డాక్టర్‌ పావని వారి బృందం, చెవి ముక్కు గొంతు వైద్యులు డాక్టర్‌ కుడారి ప్రదీప్‌కుమార్‌, బ్లూమ్స్‌ హాస్పిటల్‌ నుండి గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుష్మ పాల్గొని వైద్య సేవలు అందించారు. గుంటూరు డ్రగ్‌ అసోసియేషన్‌ వారిచే ఉచితంగా మందులు పంపిణీ చేశారు.