ప్రజాశక్తి -గాజువాక : కనీస వేతనం కోసం అదాని గంగవరం పోర్టు కార్మికులు చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలనుద్దేశించి సిపిఎం స్టీల్ జోన్ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు మాట్లాడుతూ, కార్మికుల పట్ల అదాని గంగవరం పోర్టు యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. గంగవరం పోర్టులో చట్టాలు అమలు చేయడం లేదని, ప్రశ్నించిన కార్మికులపై చార్జిషీట్లు, మెమోలు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. గంగవరం పోర్టు నిర్మాణంలో తమ ఇళ్లు, భూములు త్యాగం చేసిని నిర్వాసితులకు పేరుకే పర్మినెంట్ ఉద్యోగాలని, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు చెల్లిస్తున్నారని తెలిపారు. అదాని గంగవరం పోర్టులో ఉద్యోగ విరమణ పొందిన పోలీసు ఉన్నతాధికారులను నియమించి పోలీసుల అండదండలతో కార్మికుల పైనా, కార్మిక సంఘాలపైనా యాజమాన్యం నిర్బంధాలకు పూనుకుంటుందన్నారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి బి.జగన్ మాట్లాడుతూ, అక్రమంగా తొలగించిన కార్మికుల విధుల్లో తీసుకోవాలని, కనీస వేతనం రూ.36 వేలు, బేసిక్ రూ.22 వేలుతో కలిపి డిఎ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటాన్ని అణిచివేయాలని చూస్తే సిఐటియు చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ గుర్తింపు యూనియన్ నాయకులు సత్యనారాయణ, ఎల్లేటి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.










