Oct 31,2022 21:31

ఎపి గిరిజన సంఘం ఆధ్వర్యాన నిరసన
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

పోడు పట్టాల కోసం ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ గ్రామ సభలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం ఆధ్వర్యాన స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సంఘం సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెల్లం రామకృష్ణ, ధర్ముల రమేష్‌ మాట్లాడుతూ 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారం పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఐటిడిఎ అధికారి మారినప్పుడల్లా వ్యక్తిగత క్లెయిములు దరఖాస్తు చేసుకోవడం ఆదివాసీలకు పరిపాటిగా మారిందన్నారు. సెప్టెంబర్‌లో గ్రామసభలు నిర్వహించాలని ఐటిడిఎ పాలకవర్గ సమావేశంలో జిల్లా కలెక్టర్‌కు సమస్యను విన్నవించామని గుర్తు చేశారు. గ్రామ సభలను అక్టోబర్‌లోనే నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించినా అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. తక్షణమే పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతపత్రాన్ని ఆర్‌డిఒ ఝాన్సీరాణికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కారం భాస్కర్‌, అన్నిక వెంకటస్వామి, చొడెం దుర్గారావు, వెట్టి వీరయ్య, డి.గంగిరెడ్డి, తెల్లం దుర్గారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షు రాలు తామా ముత్యాలమ్మ, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్‌ పాల్గొన్నారు.