
ప్రజాశక్తి-దత్తిరాజేరు : జిల్లాలో అత్యంత రద్దీ మార్గంలోని పెదమానాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి అర్ధాంతరంగా నిలిచిపోయింది. పదేళ్లుగా పూర్తికాని వంతెనగా ఇది రికార్డులకెక్కింది. జిల్లా వాసుల్లో ప్రతిఒక్కరి నోటా ఇదే మాట. ఫలితంగా అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు, మరోవైపు స్థానికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అసంపూర్తి నిర్మాణ పనులతో అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ప్రధానమార్గం ఇదే కావడం, వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో నిత్యం ట్రాఫిక్‌జామ్‌తో నానాపాట్లు పాడుతున్నారు. నిర్మాణ పనులు ఎక్కడివక్కడ వదిలేయడంతో రోడ్డంతా గుంతలమయమై ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
విజయనగరం నుంచి రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం మీదుగా రాయగడ, ఇటు సాలూరు, సుంఖి మీదుగా ఒడిశా వెళ్లే 26వ నంబరు జాతీయ రహదారి ఇది. అందుకే నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అంతటి ప్రధానమైన 26వ నంబర్ జాతీయ రహదారిలో పెదమానాపురం వద్దనున్న రైల్వేగేటుతో నిత్యం వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతుండటంతో 2013లో ఫ్లైఓవర్ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు పదేళ్లు పూర్తికావస్తున్నా ఆర్‌ఒబి నిర్మాణం పూర్తికాలేదు. ఇప్పటివరకు రైల్వేట్రాక్‌కి ఇరువైపులా నాలుగు పిల్లర్లు మాత్రమే నిర్మించారు. మొత్తం బ్రిడ్జి పూర్తవడానికి పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణంతో పాటు ఓవర్‌బ్రిడ్జిని నిర్మించాలి. కానీ ఇంతవరకు అటువంటి చర్యలు తీసుకోలేదు. పర్యావసానం ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. గతేడాది జనవరిలో రోడ్డు విస్తరణ కోసం నిర్వాసితులకు పరిహారం అందజేసి, ఖాళీ చేయించి చకచకా పనులు ప్రారంభమైనా మూడు అడుగుల ముందుకు.. ఆరడుగుల వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా కాలువలు పూర్తిచేసి, డైవర్షన్ రోడ్లు వేసేందుకు పనులు చేపట్టి అర్ధాంతరంగా నిలిపేశారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కావడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డైవర్షన్ రోడ్డులో గోతులు ఏర్పడటంతో వాహనాలు ఎప్పటికప్పుడు నిలిచిపోతున్నాయి.
అందరికీ పాట్లే
మానాపురం గేటు పడితే వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సి వస్తోంది. ఒక్కోసారి రెండు, మూడు రైళ్లు వెళ్లే వరకూ గేటు తీసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎండవేడిని తట్టుకోలేక వాహనదారులు, బస్సులో వృద్ధులు, చిన్నారులతో ప్రయాణించేవారు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు.. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుపై దుమ్ము, ధూళితో స్థానికులు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రతి పది నిమిషాలకు రైల్వే గేట్ పడటంతో స్థానిక పోలీసులు ఎండలోనే ఉండి ట్రాఫిక్ మళ్లించేందుకు చర్యలు చేపట్టాల్సి వస్తోంది. ఈ రోడ్డుపై ప్రయాణం నిత్యం నరకప్రాయంగా ఉందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఫ్లైఓవర్ పనులు చేపట్టేలా చర్యలు చేపట్టి, ప్రయాణికుల కష్టాలకు విముక్తి కల్పించాలని పలువురు కోరుతున్నారు.