Apr 11,2023 00:40

ఎమ్మెల్యే ధనలక్ష్మిని చుట్టుముట్టిన గిరిజన నాయకులు, ఆదివాసీలు

ప్రజాశక్తి-మారేడుమిల్లి
బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానంపై ఏజెన్సీలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా గిరిజనుల నుంచి నిరసనలు తప్పడం లేదు. సోమవారం మండల కేంద్రంలో ఆసరా పథకం సభకు విచ్చేసిన ఎమ్మెల్యే ధనలక్ష్మిని పోలీస్‌ స్టేషన్‌ కూడలి వద్ద గిరిజన సంఘం, ఆదివాసీ జెఎసి ఆధ్వర్యాన గిరిజనులు అడ్డుకున్నారు. సుమారు గంటకుపైగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్‌, జై ఆదివాసీ అనే నినాదాలతో మండల కేంద్రం మారుమోగింది. అసెంబ్లీలో బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న అసెంబ్లీ తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించిన గిరిజన ఎమ్మెల్యే ధనలక్ష్మి వెంటనే రాజీనామా చేసి ప్రజల తరఫున పోరాటంలోకి రావాలని డిమాండ్‌ చేశారు. జిఒ నెంబర్‌ 52ను ఉపసంహరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇప్పటికే షెడ్యూల్‌ ఏరియాలో విద్య, ఉద్యోగాల్లో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చితే గిరిజనులు మరింత నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ తీర్మానం గత టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దానిని మళ్లీ ఇప్పుడు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. బెంతు ఒరియా, బోయ వాల్మీకి కులాలు నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉన్నారని, వారి వలన మనకు ఎటువంటి నష్టం లేదని చెప్పారు. దీంతో గిరిజన సంఘం జిల్లా నాయకులు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి జోక్యం చేసుకొని తెలంగాణలో లంబాడీలను ఎస్‌టి జాబితాలో చేర్చడం వల్ల అక్కడి గిరిజనులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని, అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే జీవో నెంబర్‌ 3ను రద్దు చేయడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయామన్నారు. 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజన ప్రాంతంలో విచ్చలవిడిగా గిరిజనేతరులు పెద్ద పెద్ద భవంతులు కడుతున్నా గిరిజన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బోయ, వాల్మీకి, బెంతు, ఒరియాల విషయంలో అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సుమారు గంటపాటు ఎమ్మెల్యేకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పొంతనలేని సమాధానం చెప్పి పోలీసులు సహాయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. రోడ్డుపై బైఠాయింపుతో సుమారు కిలో మీటర్‌ పొడవున వాహనాలు నిలిచిపోయాయి. గంటపాటు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఈతపల్లి సత్యనారాయణ రెడ్డి, ఈతపల్లి సిరిమల్లె రెడ్డి వికా రాజన్న ధర, వేటుకూరు సర్పంచ్‌ ఈతపల్లి మల్లీశ్వరి, జేఏసీ నాయకులు కని సన్యాసిరెడ్డి, మట్ల కృష్ణారెడ్డి, ఎంపిటిసి కొరగాని సువర్ణ రాజు, మాజీ ఎంపీటీసీ కణం విజయలక్ష్మి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు పల్లాల రాజకుమార్‌ రెడ్డి, దూడ ప్రణీత్‌, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.