ఇటీవలి కాలంలో అనేక మీడియా సంస్థల విలువలు ఎంతగా క్షీణిస్తున్నాయో, తమ వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం అనర్థదాయక ధోరణులను ఎంతగా పెంచుతున్నాయో చూస్తే విచారం కలగకమానదు. అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించడం కోసం అవాంఛనీయమైన అనారోగ్యకరమైన చర్చలు కార్యక్రమాలతో అభాసుపాలవడం, మార్కెట్ నిలుపుకోవడం కోసం కృత్రిమంగా రేటింగులు తెప్పించుకోవడానికి పడే పాట్లు అత్యున్నత స్థాయిలోనే వెల్లడైనాయి. చివరకు బార్క్ మూడు మాసాల పాటు రేటింగు ప్రక్రియనే నిలిపివేస్తున్నట్టు ప్రకటించడానికి ఈ పరిణామాలు దారి తీశాయి. రాజకీయ పార్టీలు లేదా కార్పొరేట్ ప్రయోజనాల కోసం గీత దాటిన కొన్ని పోకడలు కొత్తేమీ కాదు గాని రాను రాను అసలు ప్రజలకు సమాచారం, అవగాహన ఇచ్చే బాధ్యతనే విస్మరించడం అప్రధాన విషయాలలో ముంచి తేల్చడం వికృతంగా మారింది. విమర్శల పట్ల ప్రభుత్వాల అసహనం పెరిగి ఇలాంటి విన్యాసాలకు పరోక్ష ప్రోత్సాహం పెరిగింది. ఫలితమేమంటే ఈ కాలంలో జాతీయ చానళ్ళనేవి పదే పదే సుప్రీం కోర్టు తలుపులు తట్టవలసి వచ్చింది. తాజాగా రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్ణబ్ గోస్వామి వివాదం, అరెస్టు, కేసులు మహారాష్ట్ర స్థానిక కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా వెళ్లాయి. కరోనా తారాస్థాయిలో వున్నప్పుడు ఇళ్లకు వెళ్లాలనే ఆరాటంలో వలస కార్మికులు పొరబాటు సమాచారం వల్ల బంద్రా రైల్వే స్టేషన్‌కు చేరితే మత ముద్ర వేయడానికి పెద్ద ప్రచారం చేపట్టిన వ్యక్తి ఆర్ణబ్...ఏదో గ్రామంలో ఇద్దరు సాధువుల హత్యను సోనియా గాంధీ దాకా తీసుకువెళుతూ ఆ సమయంలోనే మరో హడావుడి చేశారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులు నోటీసు ఇస్తే తనదైన శైలిలో హంగామా చేశారు.
సుశాంత్ సింగ్, టిఆర్‌పి వ్యవహారాలు
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాదాంతం తర్వాత ఈ ధోరణి పరాకాష్టకు చేరింది. బీహార్ ఎన్నికలలో ఎదురుగాలి తట్టుకోవడానికి ఈ అంశాన్ని ఆధారం చేసుకోవాలని నితీష్ కుమార్ నాయకత్వం లోని ఎన్‌డిఎ కూటమి భావించగా అక్షరాలా అందుకు తగినట్టే కంగనా రనౌత్‌ను ముందుంచి ఆర్ణబ్ షో నడిచింది. ఇది ఏకంగా బాలీవుడ్ పైనే దాడిగా మారింది. ప్రైవేటు మెసేజ్‌లు, ఆరోపణలు హద్దు మీరిన స్థాయిలో పొంగిపొర్లాయి. దీనికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే కారణమన్నట్టు కూడా వ్యక్తిగత ప్రచారం నడిచింది. ఎట్టకేలకు ఈ కేసు కేంద్రంలోని సిబిఐ కి అప్పగించినా ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. దాంతో డ్రగ్స్ వైపు మరల్చబడింది. తీరా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్య నివేదికలో స్పష్టం కావడంతో కథ మొదటికి వచ్చింది. ఆ వివరాలన్నీ అప్రస్తుతం. కాని హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం ఉదంతం సమయంలో వీక్షకుల దృష్టి మళ్లించడానికి ఇదంతా కావాలనే జరిగినట్టు స్పష్టమైపోయింది.
సరిగ్గా ఇలాంటి తరుణం లోనే ముంబాయి పోలీసులు టిఆర్‌పి కుంభకోణం కూడా వెలికితీశారు. ఇందులోనూ మరో రెండు మరాఠీ చానళ్లతో పాటు రిపబ్లిక్ టీవీ ముందుగా దొరికిపోయింది. సుశాంత్ సింగ్ ఉదంతం లోనూ డ్రగ్స్ వ్యవహారం లోనూ తమపై ఇష్టానుసారం దుష్ప్రచారం చేసినందుకు ఆర్ణబ్ గోస్వామిపై బాలీవుడ్ హేమాహేమీలు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, మహేష్ భట్ తదితరులందరూ దావా వేశారు. అమితాబ్ బచన్ కూడా తన అసమ్మతిని కౌన్‌బనేగా కరోడ్‌పతి షోలో వెల్లడి చేశారు. అదే షోలో అంబేద్కర్ మను స్మృతిని దగ్ధం చేసిన ఘటనపై ప్రశ్న వేసినందుకు అమితాబ్‌ను ట్రోల్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మరో ఆత్మహత్య కేసులో అరెస్టు
ఆర్ణబ్ కూ మహారాష్ట్ర లోని శివసేనకూ మధ్య మొదలైన ఈ వివాదం క్రమేణా తీవ్ర రూపం తీసుకుంది. 2018లో ఆత్మహత్య చేసుకున్న డిజైనర్ అన్వరు నాయక్ ఆఖరి లేఖలో తనకు ఆర్ణబ్ కంపెనీ ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వనందువల్లనే చితికిపోయి చనిపోతున్నట్టు రాశారు. అప్పుడే ఆయనపై చర్యకు పోలీసులు సిద్ధమైతే ఢిల్లీ లోని బిజెపి పెద్దలు జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు చర్య తీసుకోవద్దని ఆదేశాలు పంపినట్టు చెబుతున్నారు. ఉద్ధవ్ థాకరే అధికారం చేపట్టాక అన్వరు కుటుంబ సభ్యులు ఆయనను కలసి మరోసారి తమకు న్యాయం కలగాలని కోరుకున్నారు. ఈ నేపథ్యం లోనే మహారాష్ట్ర పోలీసులు ఆర్ణబ్‌ను అరెస్టు చేశారు. ఆ సందర్భంగా నాటకీయ పరిణామాలు, విపరీత ప్రచారం చూశాం. ఆర్ణబ్‌ను పోలీసులు ఆలిగంజ్ కోర్టులో హాజరుపర్చగా నవంబరు 18 వరకూ రిమాండ్ విధించారు. అయితే ఈలోగానే బిజెపి నేతలు పాత్రికేయులపై దాడులు తగవంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. స్వయాన దేశ హోం మంత్రి అమిత్ షా ఇది పత్రికా స్వేచ్ఛకు హాని అని, ఎమర్జన్సీని గుర్తు చేస్తున్నదని ప్రకటన చేశారు. ఒక రాష్ట్ర పోలీసులు ఆత్మహత్య కేసులో తీసుకున్న చర్యపై హోం మంత్రి ఇలా వ్యాఖ్యానించడం విడ్డూరమే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యలో ఏ ఆధారాలు లేకున్నా అంత హడావుడి చేసినపోలీసులు తన భర్త పేర్లతో సహా లేఖ రాసి చనిపోతే ఎందుకు చర్య వద్దంటున్నారని అన్వరు భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరెస్టు పత్రికా వృత్తికి సంబంధించింది కాదనీ పాత ఫిర్యాదుపై స్పష్టమైన ఆధారాలతో చేసిందని పోలీసుల కథనం. ఫడ్నవిస్ హయాంలో కింది కోర్టులో కేసు మూసివేస్తున్నట్టు 2019లో పోలీసులు చెప్పారని, ఇప్పుడెలా పున:ప్రారంభిస్తారని విమర్శలు వచ్చినప్పుడు పద్ధతి ప్రకారం మూసివేయలేదని ఉద్ధవ్ ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ కేసు మెజిస్ట్రేట్ కోర్టు ముందకు వచ్చినప్పుడు ఆర్ణబ్ వ్యవహరించిన తీరు, దూకుడుపై న్యాయమూర్తి ఆగ్రహం వెలిబుచ్చాల్సి వచ్చింది.
మిగిలిన కేసులు పట్టవే ?
మరోవైపున ఆర్ణబ్ అరెస్టు విషయంలో పోలీసులు విమర్శలకు అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకోవాల్సి వుండిందని అంటూనే ఖండనలు కేవలం ఆయనకే పరిమితం చేయడానికి లేదని దేశంలో మీడియా వర్గాలు ముక్త కంఠంతో వ్యాఖ్యానించాయి. ఉదాహరణకు ఇటీవలనే శ్రీనగర్‌లో 'కాశ్మీర్ టైమ్స్' పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయించి దాని ఎడిటర్‌ను వేధించిన ఘటన చూశాం. హత్రాస్ అమానుష అత్యాచారంపై చర్యలు తీసుకునే బదులు యు.పి లోని యోగి ప్రభుత్వం మళయాల జర్నలిస్టు కన్నన్ కప్పన్ బాధితులను రెచ్చగొడుతున్నారని పోలీసులు కేసు పెట్టడం చూశాం. అంతకుముందు 'న్యూస్ క్లిక్' విలేకరి కూడా ఇలాంటి వేధింపులకే గురయ్యారు. జెఎన్‌యు ఉదంతం లోనూ భీమ కోరేగావ్ కేసు లోనూ ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక ఆందోళనల సందర్భం లోనూ ఎందరో రచయితలు, కాలమిస్టులు దేశద్రోహులుగా చిత్రించబడ్డారు. అంగవైకల్యంతో బాధపడే ప్రొఫెసర్ సాయిబాబా, వయోవృద్ధుడైన వరవరరావు, ఆనంద్ తెల్తుంబ్డే, స్టాన్స్ స్వామి వంటి వారు కారాగారంలో మగ్గిపోతున్నారు. వారి బెయిల్ పిటిషన్లు విచారించడానికి, ఆరోగ్య రక్షణకు కూడా న్యాయస్థానాలు చొరవ చూపడం లేదు. ఎన్.డి టి.వి వంటి వాటిపై ఏవేవో ఆర్థిక ఆరోపణలతో వెంటాడిన ఉదాహరణలు కూడా వున్నాయి. అదే ఆర్ణబ్ విషయానికి వచ్చేసరికి మోడీ ప్రభుత్వం మొత్తం రంగం లోకి దిగి...పత్రికా స్వేచ్ఛ, ఎమర్జన్సీ రోజులు, కక్ష సాధింపు వంటి గొప్ప మాటలు చెబుతున్నది. ఈ వైరుధ్యాన్ని చాలా మంది మీడియా నిపుణులు సూటిగా పేర్కొంటున్నారు. చాలా పత్రికలు దీనిపై సంపాదకీయలు రాశాయి. ఆ రిపబ్లిక్ మన రిపబ్లిక్ అని 'వైర్' శీర్షిక నిచ్చింది. ఆర్ణబ్ విద్వేష వ్యూహంతో దురుద్దేశ పూరితంగా జాతీయ చర్చ పెట్టడం వల్ల ఎందరో ప్రజాస్వామిక వాదులు, చిన్న చితక వ్యాపారులు, వృత్తి నిపుణులు కూడా బలైపోయిన ఉదాహరణలను ఒక జర్నలిస్టు ఉటంకించారు. ఆర్ణబ్ చర్చలలో 70 శాతం విద్వేషం పెంచేదిగా వున్నట్టు కోట శైలజ పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు రక్షణ
ఈ కేసు నడుస్తుండగానే సుప్రీం కోర్టు నవంబరు ఆరున మహారాష్ట్ర శాసనసభ హక్కుల తీర్మానం బెదిరింపు కేసులో ఆర్ణబ్ ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది. తన గురించి శాసనసభలో ముఖ్యమంత్రి అభ్యంతరకరంగా మాట్లాడారంటూ ఆర్ణబ్ కోర్టులో ఒక సాక్ష్యాధారం సమర్పించారు. సభాపతి అనుమతి తీసుకోకుండా సభ చర్చను కోర్టులో ఎలా సమర్పిస్తావని శాసనసభ కార్యదర్శి అక్టోబరు 13న ఆయనకు లేఖ రాశారు. ముఖ్యమంత్రిపై ఉపయోగించిన భాష అసభ్యంగా వుందని ఉదాహరణలతో పేర్కొన్నారు. దీనిపై హక్కుల తీర్మానం రావచ్చని హెచ్చరించారు. ఈ లేఖనే ఆర్ణబ్ దాఖలు చేస్తూ కోర్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాజ్యాంగం 32వ అధికరణం ప్రకారం రాజ్యాంగ న్యాయస్థానంగా వుండే కోర్టు ముందు సమర్పించిన సాక్ష్యాధారంపై ఎలా నోటీసు ఇస్తారని శాసనసభ కార్యదర్శిపై విరుచుకు పడింది. మీకెంత ధైర్యం అని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులు కాపాడకపోతే మేమెందుకంటూ సిజెఐ ఆగ్రహోదగ్రులైనారు. కోర్టు ధిక్కారం కింద ఆయనపై ఎందుకు చర్య తీసుకోవద్దని ప్రశ్నిస్తూ ఒక న్యాయవాదిని ఇందుకు అమికస్ క్యూరిగా నియమించింది. ఈ విధంగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు రక్షణ ఇవ్వడమే గాక శాసనసభను తీవ్ర భాషలో తప్పు పట్టడం ఆసక్తికరమైన పరిణామం. ఆ విధంగా ఇది న్యాయ వ్యవస్థకూ చట్టసభకు మధ్య ఘర్షణగా మారిపోయింది. ప్రశ్నించడమే నేరమంటూ ప్రజాస్వామికంగా విమర్శ చేసేవారందరినీ వేటాడే మోడీ ప్రభుత్వం ఆర్ణబ్ గోస్వామి పట్ల ఇంత ప్రత్యేకాసక్తి చూపుతున్నా....మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వంటి వారు ఉదాసీనంగా వున్నారు. ఆత్మహత్య చేసుకున్న అన్వరు నాయక్ మరాఠీ కావడం అందుకు కారణం. ఈ విషయంలో ఎక్కువగా స్పందిస్తే సుశాంత్ సింగ్ కేసులో వ్యూహం బెడిసికొడుతుందని వారు భయపడుతున్నారట. అసహ్యకరంగా మారిన అమెరికా అధక్ష ఎన్నికల వ్యవహారంతో సహా ప్రతి సందర్భంలో మీడియా, సోషల్ మీడియాల పాత్ర ప్రశ్నార్థకం అవుతున్న తీరు చూస్తూనే వున్నాం. అదే ఫేస్‌బుక్, ట్విటర్‌లు ఇండియాలో బిజెపికి క్రమపద్ధతిలో తోడ్పాటునిచ్చాయని 'వాషింగ్టన్ పోస్టు' రాసింది. మీడియా వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణలు బాగా పనికి వస్తాయి. అందులోని ద్వంద్వనీతిని కూడా తెలుసుకోవడానికి అస్మదీయ ఆర్ణబ్ ఉదంతం పరాకాష్ట.
తెలకపల్లి రవి











