Aug 12,2023 00:25

నీరు లేక ఎండిపోతున్న వరి చేను

ప్రజాశక్తి-మాడుగుల:కొద్ది రోజులుగా వర్షాలు లేక పోవడంతో నాట్లు వేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయి. అల్ప పీడనం కారణంగా రెండు వారాలు కిందట భారీ వర్షాలు కురవడంతో, అనేక గ్రామాలలో వరి నాట్లు ముమ్మరంగా సాగాయి. కానీ, ఆ తరువాత వర్షాలు కురవక పోవడంతో వరి నాట్లు వేసిన పొలాలలో నీరు లేక ఎండి పోతున్నాయి. దీంతో, ఆరంభంలోనే రైతు కష్టాలు మొదలు అయ్యాయి. మాడుగుల మండలంలో పెద్దేరు జలాశయం మినహా మిగిలిన నాలుగు జలాశయాల పరిధిలో కాలువలు లేక నీరు సక్రమంగా అందడం లేదు. తాచేరు రిజర్వాయర్‌ నుండి రావలసిన నీరు పూర్తిగా సరఫరా కా లేదు. జలాశయం సమీప గ్రామాలకు సైతం నీరు అందక పోగా, మాడుగుల పంట పొలాల సాగు ప్రశ్నార్ధకంగా మారింది. గేట్లు మరమ్మత్తులు, కాలువలు పని చేయక పోవడంతో ఆరంభ దశ లోనే వరి సాగు ప్రశ్నార్ధకంగా మారింది. మరో పక్క ఒకే సారి నాట్లు వేస్తుండంతో కూలీల కొరత భారీగా ఏర్పడింది విద్యుత్‌ సైతం పూర్తి సరఫరా కాక పోవడంతో స్వంతంగా బోర్లు వున్న రైతులకు సైతం వారి పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అంద లేదు. ఈ నేపథ్యంలో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకుని నాట్లు వేసిన పొలాలకు నీరు అందిస్తున్నారు. ఈ ఏడాది కష్ట కాలంగా కనబడుతుందని గగ్గోలు పెడుతున్నారు.