ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వచ్చేనెల 20-30 తేదీల్లో నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విజయవంతమయ్యేలా అధికారులు పని చేయాలని జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో జెసి మాట్లాడుతూ క్రీడా ప్రాంగణంలో ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, 24 గంటలు వైద్య సేవలు అందించేలా బృందాలను ఏర్పాటు చేయాలని, అంబులెన్స్, స్ట్రెచర్‌లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. విద్యుత్ సరఫరా నిరంతరం ఉండాలని, జనరేటర్‌లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర ఏర్పాటు ఉండాలన్నారు. క్రీడా ప్రాంగణములో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సూచించారు. రిక్రూట్‌మెంట్ విధులకు వచ్చే ఆర్మీ సిబ్బందికి వసతి ఏర్పాటు చేయాలన్నారు. అవసమైనచోట సిసి కెమేరాలను శాశ్వత ప్రాతిపదిక ఏర్పాటు చేయాలన్నారు. 6, 7 జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులకు అర్థమయ్యేలా గుర్తింపు బోర్డులను, మ్యాపు బోర్డులను అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో డిఆర్‌ఒ వినాయకం, డిఎంహెచ్‌ఒ డాక్టర్ జి.శోభారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










