పల్నాడు జిల్లా: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే భారత్ ఆర్మీ రిక్రూట్ మెంట్ (అగ్నిపథ్) ర్యాలీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. నరసరావుపేట కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలునుంచి సంబంధిత శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, కల్నల్ పునీత్ లు కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించి, అభ్యర్థులే ఎంపిక చేయనున్న నేపథ్యంలో తరలివచ్చే అభ్యర్థుల కోసం అన్ని వసతి ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే నరసరావుపేట పట్టణంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం ను ర్యాలీ రిక్రూట్ మెంట్ కి సంబంధించి ఏర్పాట్లను చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఆర్మీ అధికారుల వసతి కోసం ఎస్.ఎస్.ఎన్ కళాశాల బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు వివరించారు.పలు జిల్లాల నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ కు వచ్చే అభ్యర్థుల కోసం బారికెేడ్స్, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లు, వైద్య సహాయ కేంద్రం తదితర ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వినాయకం, వైద్య ఆరోగ్యశాఖ, రహదారులు, భవనాల శాఖ, మున్సిపల్ శాఖ, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.










