Oct 06,2022 23:34

అక్రమ కట్టడాన్ని పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-డుంబ్రిగూడ: గిరిజనులకు రక్షణ కవచంగా కల్పించిన 1/70 చట్టాన్ని ధిక్కరించి మండలంలోని అరకు సంత బయలు గ్రామంలో ఓ గిరిజన నేతరుడు దర్జాగా మెయిన్‌ రోడ్డు పక్కనే అక్రమ కట్టడాన్ని నిర్మించుకుంటున్నారు. నిర్మిస్తున్నట్లు స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానిక గ్రామస్తులు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా అరకు సంత బయలు గ్రామంలో గిరిజన నేతరుల అక్రమ కట్టడాలు జోరుగా జరుగుతున్నాయి. గిరిజన చట్టాలను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ అధికారులే గిరిజనేతరులకు కొమ్ము కాస్తుండటంతో అరకు సంత బయలు గ్రామంలో ప్రభుత్వ స్థలాలైన జిసిసి, మార్కెట్‌తో పాటు ఆర్‌అండ్‌బి స్థలాలన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి.
అరకు సంత బయలులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అనుకుని ఓ గిరిజనేతరుడు పిల్లర్స్‌తో శాశ్వత నిర్మాణాన్ని చేపడుతున్నారు. అరకు, పాడేరు ప్రధాన రోడ్డుకు అనుకొని నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు గుండా నిరంతరం స్థానిక రెవెన్యూ శాఖ అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు సైతం రాకపోకలు సాగిస్తున్నారు. గిరిజనేతరుడు నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేయడంలో మాత్రం చర్యలు తీసుకోక పోవడం విచారకరం. తక్షణమే అధికారులు స్పందించి గిరిజన నేతరుడు నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని వెంటనే తొలగించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.
తొలగించకపోతే ఆందోళన: సిపిఎం
అరకు సంత బయలు గ్రామంలోని ప్రధాన రోడ్డుకు అనుకొని గిరిజనేతరుడు నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని స్థానిక సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌బి పోతురాజు హెచ్చరించారు. అరకులో గిరిజ నేతరుడు నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని స్థానిక సిపిఎం నాయకులు సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 1/70 భూ బదలాయింపు చట్టాన్ని ధిక్కరించి గిరిజన నేతలు ఇక్కడ విచ్చలవిడిగా అక్రమ కట్టడాలను నిర్మించుకుంటున్నారన్నారు. అది కూడా గత రెండేళ్ల నుంచి ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మిస్తున్నట్లు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. తక్షణమే గిరిజన నేతరుడు నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ అక్రమ కట్టడాన్ని పరిశీలించిన వారిలో ఆ పార్టీ నాయకులు పి.సురేష్‌ కుమార్‌, పి.సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.