ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం సరుకుల్లో కోత విధిస్తుండడంతో కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. రాయితీ కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు బయట మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేసుకొంటున్నారు. మరోవైపు ఇంటింటికీ అని చెప్పి పంపిణీ ప్రారంభించినా ఎక్కడో వీధి చివరన మాత్రమే ఉంచి సరుకులను అందిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 6,45,811 బియ్యం కార్డులుండగా 1,060 రేషన్ షాపుల పరిధిలో 420 ఎండియు వాహనాల ద్వారా నెలనెలా బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీ జరుగుతోంది.
కందిపప్పు లేదాయో..
జిల్లాలో ఉన్న లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కొక్కరికీ కిలో కందిపప్పు ఇస్తుండగా ఈ లెక్కన సుమారు 600 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ఈ నెలలో ఒక్క కేజీ కందిపప్పు కూడా ఇవ్వలేదు. గత నెలలో సగం మందికి కూడా ఇవ్వలేకపోయారు. బయట మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.150 పలుకుతోంది. రేషన్ షాపుల ద్వారా ఇచ్చే కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నిత్యవసరాలు సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో ఆర్థిక కష్టాలు రెట్టింపు అయ్యాయని గగ్గోలు పెడుతున్నారు. బయట మార్కెట్లో సరుకులను కొనలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వర్ సమస్యలతో సతమతం
ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి 17వ తేదీ లోపు ఇంటింటికీ రేషన్ పంపిణీని పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 40 శాతం కూడా పంపిణీ పూర్తి చేయలేదు. సాంకేతిక సమస్యలు, సర్వర్ స్లోగా ఉండడంతో ఎండియూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఇప్పటివరకు ఒకసారి వేలిముద్ర వేస్తే సరిపోయేది. ఈ నెలలో రెండుసార్లు వేయాల్సి వస్తోంది. దీంతో సర్వర్ ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద ఎస్‌సి, ఎస్‌టిలతో అంత్యోదయ కార్డుల లబ్ధిదారులకు ఉచిత బియ్యం అందజేస్తుంది. వీరంతా బియ్యానికి ఒకసారి పంచదారకు మరోసారి వేలిముద్రలు వేయాల్సి వస్తోంది.
వాహనం వస్తే పరుగులు
ఎండియు వాహనాల ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుండగా ఇళ్ల వద్దకే సరుకులు అందజేయాల్సి ఉంది. అయితే వీధి చివరన ఆగిపోతుండడంతో లబ్ధిదారులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. గతంలో సరుకులను ఆయా దుకాణాలకు వెళ్లి తెచ్చుకునే వారు. సమయం కుదిరినప్పుడల్లా వెళ్లి తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు వాహనాలు కేటాయించగా అవి ఎప్పుడొస్తాయో సమయ పాలన ఉండడం లేదు. వచ్చినా వీధి చివరన ఎక్కడో ఒకచోట ఉంచుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.










