ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికలో భాగంగా ఏటా ఖరీప్, రబీ సీజన్లలో జిల్లాలో సాగు లక్ష్యాన్ని నిర్ధేశించడంతో పాటు ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతాయి. వాటికి రాయితీపై ఎన్ని విత్తనాలు అందించాలి, ఎరువులు ఎంత అవసరం ఇలా అన్నివిధాలుగా ప్రణాళిక సిద్ధం చేయడంతోపాటు రైతులకు సాగులో మెళకువలను తెలియజేయడం కోసం పొలం బడుల నిర్వహణకు లాక్ష్యాన్ని నిర్ధేశించి ఆ దిశగా కార్యాచరణను అమలు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కాకినాడ జిల్లాలో 378 పొలంబడులను ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యం పెట్టుకోగా ప్రభుత్వం వాటి నిర్వహణకు ఈసారి నిధుల్లో కోత విధించింది. దాంతో చేసేదేమీ లేక అధికారులు లాక్ష్యాన్ని కుదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఏడాది జిల్లాలో 2.61 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పంటలు పండుతాయని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ధేశించింది. ఇందులో వరి 2,31,245 ఎకరాలు, పత్తి 6,250, చెరకు 2,647, మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగవనున్నాయి. రైతులకు ఆరోగ్యకరమైన పంటలను పండించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు పొలంబడుల కార్యక్రమంలో ద్వారా అవగాహన కల్పిస్తారు. ప్రతి సీజన్లో విత్తనాలు వేసినప్పటి నుంచి పంట కోసి చేతికి అందే వరకూ రైతులకు సమగ్రమైన సూచనలు, సలహాలు ఇస్తారు. తద్వారా పంటలను నష్టపోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎలుకల బెడద, చీడపీడల నుంచి పంటను ఏ విధంగా సంరక్షించుకోవాలనే అంశాలపై వివరిస్తారు. 14 వారాలపాటు 25 ఎకరాలకు ఒక పొలంబడిని ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో 30 మంది రైతులకు సమాచారం తెలియజేస్తారు. ఇక్కడ తెలుసుకున్న రైతులు మిగిలిన వారికి ఆయా అంశాలను వివరిస్తారు.
లక్ష్యం నిర్లక్ష్యం
గతంలో జిల్లావ్యాప్తంగా ప్రతి సీజన్‌లో మండలానికి 10 నుంచి 15 పొలంబడులు కార్యక్రమాలను నిర్వహించేవారు. అధిక దిగుబడులను సాధించడం, సస్యరక్షణ, మేలైన సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, సేంద్రీయ ఎరువుల తయారీ విధానం వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించేవారు. గతేడాది కూడా ఎక్కువగానే నిర్వహించారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఆదేశాలతో కార్యక్రమాలను పూర్తిగా కుదించారు. ప్రతి మండలానికి కేవలం 2 నుంచి 3 పొలంబడులను మాత్రమే నిర్వహిస్తున్నారు. పిఠాపురం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లో గత ఖరీఫ్ లో పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల పరిధిలో 35 పైనే నిర్వహించగా ఈ సంవత్సరం కేవలం 7 మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఒకటి, వ్యవసాయ సహాయకుడు మరొకటి నిర్వహించాల్సి ఉంది. ఒక్కో పొలంబడి నిర్వహణకు ప్రభుత్వం రూ.20 వేలు నిధులను కేటాయించేది. గతేడాది ఖరీఫ్ సీజన్లో సుమారు రూ.48 లక్షలు కేటాయించగా ఈ సంవత్సరం కేవలం రూ.10 లక్షల లోపే కేటాయించింది.










