హడావిడి. ఆర్భాటం.. అటకెక్కింది..
అరకొరగానే జి20 సుందరీకరణ
సదస్సు ముగిసిన వెంటనే నిలిచిన పనులు
దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్న అర్థారతర పనులు
ప్రజాశక్తి - భీమునిపట్నం : విశాఖలో ఎంతో అట్టహాసంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జి20 సదస్సు నేపథ్యంలో మహానగరంలో చేపట్టిన పలు ఆధునికీకరణ, సుందరీకరణ, అభివృద్ధి పనులన్నీ ఎందుకనో అర్థాంతరంగా నిలిచిపోయాయి. సదస్సును మైలురాయిగా నిలిపేందుకు, వచ్చే విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేందుకు వీలుగా నగరంతోపాటు శివారున ఉన్న భీమిలి పట్టణం, బీచ్‌రోడ్డులో చేపట్టిన పనులన్నీ అరకొరగా దర్శనమిస్తున్నాయి. పనులు ప్రారంభించినప్పుడున్న హడావిడి, హంగామా తర్వాత లేకపోవడంతో అనేక పనులు అర్థాంతరంగా నిలిచి, ఆంధ్రులు ఆరంభశూరులు అనే పేరును సార్ధకం చేసేలా దిష్టిబొమ్మల్లా ఉన్నాయి. తర్వాత రోజు నుంచి వీటివైపు కన్నెత్తి చూసే వారే లేకపోవడంతో కోట్లలో నిధులు దుర్వినియోగమే తప్ప, ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖ నగరం వేదికగా గతనెల 28,29 తేదీల్లో జి20 సదస్సు అట్టహాసంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు అనేక దేశాల ప్రతినిధులు రానుండడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహానగరం సుందరీకరణ పనులు చేపట్టింది. నెలరోజుల ముందునుంచే నేతలు, అధికారులు హడావిడి చేస్తూ, వెంటబడి మరీ పనులు చేయించారు. అయితే హంగామా మిగిలిందే గానీ, సదస్సు రోజునాటికి అనేక పనులు పూర్తి చేయలేకపోయారు. సదస్సు ముగిసిన తర్వాత వాటి జోలికి రాకపోవడంతో అనేక పనులు అర్థారతరంగానే మిగిలిపోయాయి. నెలరోజులౌతున్నా వీటివైపు కన్నెత్తి చూసే నాధులే లేకపోవడంతో దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయని పలువురు విమర్శిస్తున్నారు.
జి 20 సదస్సు నేపథ్యంలో నగర సుందరీకరణకు ప్రభుత్వం రూ 135 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగానే భీమిలి బీచ్‌రోడ్డు అభివృద్ధి, సుందరీకరణ, మౌలిక సదుపాయాలు కల్పనకు జివిఎంసి రూ.2.71కోట్లు కేటాయించింది. ఆ నిధులతో రోడ్డుకు ఇరువైపులా, డివైడర్లకు రంగులు, పుట్‌పాత్‌లకు హంగులు, గోడలకు విభిన్న తరహా బొమ్మలతో కూడిన వాల్ పెయింటింగులు, ఫ్లవర్ బాక్స్‌లు ఏర్పాటు, బస్‌స్టాప్, మరుగుదొడ్ల ఆధునికీకరణ, సెంట్రల్ లైటింగ్ వంటి పనులు చేపట్టారు.
పనుల నాణ్యత విషయం పక్కన పెడితే, జి20 సదస్సు నాటికి పనులు పూర్తికాకపోవడం, తర్వాత వీటి ఊసెత్తకపోవడంతో నెలరోజులు గడిచిన అలాగే అర్థాంతరంగానే దర్శనమిస్తున్నాయి. పనులు ప్రారంభించినప్పటి హడావిడి పూర్తిచేయడంలో లేకపోవడమే దీనికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. భీమిలి, బీచ్‌రోడ్డులో పైలాన్, వాటర్ ఫౌంటేయిన్, సెంట్రల్ లైటింగ్, బీచ్ వద్ద రక్షణగోడ నిర్మాణం వంటి అర్థాంతర పనులు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. బీచ్ రోడ్డుపొడుగునా సెంట్రల్ లైటింగ్‌కు పోల్స్ వేసినా, నేటికీ దీపాలు అమర్చలేదు. అయితే సదస్సు ముగిసిపోయిందిలే ఇంకెందుకని పనులన్నీ అరకొరగా వదిలేశారో? లేకుంటే నిధుల కొరత, లేక, విడుదలలో జాప్యమా? లేకుంటే కారట్రాక్టర్ల నిర్లక్ష్యమా? లేకుంటే ప్రభుత్వం, అధికారుల నిర్వాకమా? కారణమేదైనా మైలురాయిగా నిలవాల్సిన జి20 సదస్సు సుందరీకరణ పనులు ఇపుడు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తూ నిర్వాహకుల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి.










