ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి యు.కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన సిద్ది సత్యనారాయణ ఇద్దరు పిల్లలు ప్రభుత్వ హైస్కూల్లో 8, 10 తరగతులు చదువుతున్నారు. ఒక్కొక్కరికీ మూడు జతల చొప్పున యూనిఫామ్ అందించగా కుట్టు కూలీ ఒక్కో జతకు రూ.80 మాత్రమే బ్యాంకు ఖాతాలో వేస్తామని హెడ్మాస్టారు చెప్పినట్లు తెలిపాస ప్రభుత్వం మొత్తంగా రూ.480 ఇస్తుండగా కుట్టేందుకు టైలర్ ఒక్కో జతకు రూ.500 అడుగుతున్నారు. ఇలా ఇద్దరికీ రూ.3 వేలు ఖర్చు అవుతుండగా రూ.2,520 అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడ జిల్లాలో 1,283 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 76,920 మంది బాలురు, 82,877 మంది బాలికలు మొత్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు 1,59,797 మంది చదువుతున్నారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా కిట్లో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బెల్ట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, డిక్షనరీ, మూడు జతల యూనిఫామ్, బ్యాగు ఇస్తున్నారు. కుట్టించుకునేందుకు కుట్టికూలీ తల్లిదండ్రులు బ్యాంకుల ఖాతాల్లో వేస్తారు. 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.120, తొమ్మిది, పది తరగతులు చదివే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.240ల చొప్పున జమ చేస్తారు.
తప్పని అదనపు భారం
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గతంలో ప్రభుత్వమే యూనిఫామ్ కుట్టించి ఇచ్చేది. అయితే కొలతలు సరిపోకపోవడం, కుట్టులో క్వాలిటీ తగ్గడం వంటి కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తేవి. దీంతో విద్యాశాఖ తల్లిదండ్రులే కొలతలకు సరిపడా కుట్టించుకునే విధంగా మార్పులు చేసింది. దీంతో గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులే సొంతంగా టైలర్ వద్దకు తీసుకెళ్లి కుట్టించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇస్తున్న కుట్టుకూలీ ఏ మాత్రం సరిపోవడం లేదు. ఒక్కో జతకు టైలర్లు రూ.400 నుంచి రూ.500 కుట్టుకూలీ తీసుకుంటున్నారు. దీంతో అందరిపైనా భారం తప్పడం లేదు. కూలీ, నాలీ చేసుకుని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్న తమపై ఈ కుట్టుకూలీ అదనపు భారంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










