Mar 07,2023 01:34
దెబ్బతిన్న వరి పైరును పరిశీలిస్తున్న మంత్రి మేరుగ నాగార్జున (ఫైల్‌)

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: గతేడాది డిసెంబరులో మాండస్‌ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వరి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజక వర్గాల పరిధిలో వ్యవసాయ శాఖ అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లింది. ఉన్నతాధికా రుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మరోసారి సర్వే నిర్వహించిన అధికారులు పంట నష్టాన్ని 47 వేల ఎకరాలకు పరిమితం చేశారు. ప్రభుత్వం జిల్లాలో 32,647 మంది రైతులకు సంబంధించి 17,944 హెక్టార్లలోని పంట లకు రూ.26.58 కోట్ల నష్ట పరిహారం ప్రకటించింది. దీంతో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతుల పేర్లు పరిహారం జాబితాలో లేకుండా పోయాయి. ఉద్యానవన పంటలకు సంబంధించి కోరిశపాడు, జె. పంగు లూరు మండలాల్లో మిరప, కూరగాయలకు 17 గ్రామాల పరిధిలో 1,702 మంది రైతులకు 862 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు తేల్చారు. ఆ పంటలకు రూ.1.29 కోట్ల నష్ట పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే 33 శాతం పైగా నష్టం వాటిల్లి రైతులకే పరిహారం ఇచ్చారు.
మాండూస్‌ తుఫానుకు ముందు 30 వేల ఎకరాల్లో వరిపంట కోసి ఓదెలపై ఉంచారు. కొద్ది మంది రైతులు పాలాల్లో కుప్పలు వేసుకున్నారు. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఓదెలపై ఉన్న పంట అంతా నీట మునిగింది. ఓదెలు నీటిపై తేలాడాయి. అదే విధంగా మరో 45 వేల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పంట వర్షానికి నేలకొరిగింది. దీంతో జిల్లాలో మొత్తం 75 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. అయితే ప్రాథమిక పంటనష్టం అంచనాలకు తుది నివేదికల మధ్య చాలా వత్యాసం వచ్చింది. నష్టం అంచనాల్లో అధికారులు భారీగా కోత పెట్టారు. వర్షానికి నేలకొరిగిన పంటను నిబంధనలు సాకుగా చూపించి నమోదు చేయలేదని రైతులు అప్పట్లోనే ఆరోపించారు. పొగాకు, మిర్చి, మినుము పంటలు ఉరకెత్తలేదన్నట్లుగా నివేదికలు ఇచ్చారు. ఈ క్రాప్‌ నమోదు చేయలేదని కొంత పంట లెక్కలోకి రాలేదు. ఒక్కొక్క రైతుకు మూడున్నర ఎకరాల వరకే పంటనష్టం వస్తుందని సీలింగ్‌ పెట్టారు. దీంతో ఒక్కొక్క రైతుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ నష్టం వాటిల్లింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ నష్ట పరిహారం ఎకరాకు రూ.5 వేలు మాత్రమే వచ్చింది. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అయితే కొనుగోలు చేయలేదు. దీంతో రైౖతులు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్మి నష్టపోయారు. వరి, పొగాకు, మిరప, మినుము ఇతర వాణిజ్య పంటలు భారీవర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లింది. దిక్కుతోచని స్థితిలో తమకు ఈక్రాప్‌ నమోదుతో సంబంధం లేకుండా నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.