అరకొరగా కేటాయింపులు
- సాగు నీటి ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు
- వైద్యం, పర్యాటకానికి శూన్యం - జిల్లా వాసులను నిరాశ పరిచిన రాష్ట్ర బడ్జెట్
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ కూడా జిల్లా వాసులను నిరాశపరచింది. సాగునీటి ప్రాజెక్టులకు నామమాత్రం కేటాయింపులతో సరిపెట్టారు. పర్యాటక, వైద్య రంగాలకు కేటాయింపులు శూన్యం. ఎన్నికల నేపథ్యంలో విద్యా రంగానికి అంకెల్లో కేటాయింపులు చూపారు...
రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు అరకొరగా నిధులను కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులను కేటాయించారు. తుంగభద్ర ఎల్‌ఎల్‌సికి రూ.80.93 కోట్లు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి రూ.8 కోట్లు, కెసి కెనాల్ కాలువల నిర్వహణ, మరమ్మతు పనుల కోసం 225.22 కోట్లు, ఎస్‌ఆర్‌బిసి పనుల కోసం రూ.42.75 కోట్లు, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి రూ.24.64 కోట్లను కేటాయించారు. 68 చెరువులను నింపే పథకానికి రూ.56.50 కోట్లు కేటాయించారు. మొత్తంగా కర్నూలు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు రూ.594.56 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. విద్యా రంగానికి కూడా నామమాత్రంగా అంకెల్కో కేటాయింపులను చూపారు. క్లస్టర్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.32.83 కోట్లు, రాయలసీమ యూనివర్సిటీకి రూ.7.93 కోట్లు, అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకి రూ.5 కోట్లను కేటాయించారు. వైద్యం, పర్యాటక రంగానికి ప్రసిద్ధి చెందిన కర్నూలు జిల్లాకు ఆ రంగాల్లో ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. ఇలా నామమాత్రపు కేటాయింపులతో జిల్లా వాసులను ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ నిరాశపరచింది.
గతి లేని గుండ్రేవుల
కర్నూలు, కడప జిల్లాలకు మేలు కలిగిలే రూపొందించిన గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులనూ కేటాయించలేదు. చర్యలేవీ ఇప్పటి వరకూ మొదలు కాలేదు. కర్నూలు జిల్లా సుంకేసుల దగ్గర తుంగభద్ర నదిపై 1.20 టిఎంసిల సామర్థ్యంతో 1865లో అప్పటి పాలకులు సుంకేసుల జలాశయాన్ని నిర్మించారు. ఈ బ్యారేజీకి అనుసంధానంగా కర్నూలు-కడప (కెసి) కాలువ నిర్మించారు. జల రవాణా కోసం నిర్మించిన కాలువను స్వాతంత్య్రం అనంతరం సాగునీటి కాలువగా మార్చారు. కర్నూలు జిల్లాలోని సి.బెళగల్, నందవరం, తెలంగాణలోని రాజోలి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గుండ్రేవుల జలాశయం నిర్మాణం జరిగితే 20 టిఎంసిలు నిల్వ చేయనున్నారు. వరద లేని సమయంలోనూ ఈ నీటిని వాడుకోవచ్చు.
ఉత్తిపోతలుగానే వేదవతి ఎత్తిపోతలు
కరవుకు నిలయమైన ఆలూరు ప్రాంతంలో పొలాలు పచ్చబడాలన్న ఉద్దేశంతో వేదవతి నది పరిధిలో నిర్మించిన ఎత్తిపోతలు ఉత్తిపోతలుగా మారాయి. వేదవతి నది పరిధిలో అమృతాపురం, జె.హౌసళ్లి , సిద్ధాపురం వద్ద మూడు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. 2008 లో మంత్రి మారెప్ప హయాంలో వీటిని చేపట్టారు. నిర్వహణలో లోపాలు అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో పథకాలు ఏడాదికే నిరుపయోగంగా మారాయి. పథకం ప్రారంభంలో వేసిన గొట్టాలు దెబ్బతిన్నాయి. ఒక్కో ఎత్తిపోతల కింద 500 నుంచి 600 ఎకరాల ఆయకట్టు ఉంది.
వలస నివారణ చర్యలు శూన్యం
ఏళ్లు గడుస్తున్నా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వలస వెతలు తప్పడం లేదు. ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని ఇతర పట్టణాలకు, నగరాలకు తరలిపోతున్నారు. కోసిగి, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, హోళగుంద, ఆలూరు, కోడుమూరు మండలాల నుంచి ఈ ఏడాది కూడా వలసలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ, బెంగళూరు, గుంటూరు, ముంబైలకు తరలివెళ్లారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 40వేల మందికి పైగా వలస వెళ్లారు. వలస నివారణకు చర్యలు చేపట్టే అంశాన్ని ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.
అంకెలు ఘనం.. అభివృద్ధి శూన్యం..
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలు ఘనంగా ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్ విమర్శించారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రూ. 2 లక్షల 79 వేల 279 కోట్ల భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అయితే ఇందులో రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు దాదాపుగా 77 వేల కోట్లు ఉన్నట్లు చూపించిందన్నారు. ఈ లోటు పుడ్చడానికి ప్రజల పైన భారాలు వేయడం, అప్పులు చేయటం జరుగుతాయి తప్ప అభివృద్ధికి మాత్రం కాదన్నారు. ఈ బడ్జెట్లో నిరుద్యోగులకు మొండిచేయి చూపారని తెలిపారు. పక్కా గృహాలకు నిధులు పెంచుతారని ఆశించిన పేద ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. సాగునీటి రంగానికి పేరుకు రూ.11 వేల కోట్లు కేటాయించినా గతంలో కూడా రూ.11 వేల కోట్లు కేటాయించినా ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. ఇప్పుడు కూడా పేరు గొప్ప ఊరు దిబ్బలాగా కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు. గాలేరు నగరికి సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల ఇంకా పొడిగిస్తూ 2026కు పూర్తి చేస్తామని చెప్పడం దారుణమన్నారు. కేవలం నవరత్నాలకు నిధులు కేటాయించడం తప్ప మౌలిక వసతులు కల్పించక, పరిశ్రమలు ఏర్పాటు చేయక, ఉద్యోగాలు కల్పించకుండా మోసపూరిత బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు.
ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్
- ఎపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు
ప్రజాశక్తి - నంద్యాల
బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదని, కేవలం సిఎం జగన్మోహన్ రెడ్డిని మెప్పించేలా ఉందని ఎపిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్ రావు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. పచ్చి అబద్దాలతో ఈ బడ్జెట్‌ను రూపొందించి సిఎం ఆర్థిక శాఖ మంత్రితో చదివించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయం ప్రస్తావించినప్పుడు సభలోని సభ్యుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో మంత్రి సభ్యులను రిక్వెస్ట్ చేసి సిఎంకు చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయమని చెప్పటం దీనికి నిదర్శనమన్నారు. ఏ ఒక్క సభ్యులకు కూడా ఈ బడ్జెట్ మీద నమ్మకం లేదనేది తేటతెల్లమవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులు అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. ఎపికి రాజధాని ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. మొత్తం మీద అంకెల గారడితో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారని విమర్శించారు.
మోసపూరిత బడ్జెట్
- టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదు : ధర్మవరం సుబ్బారెడ్డి
ప్రజాశక్తి-డోన్
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైనదని టిడిపి డోన్ నియోజకవర్గ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు. జీతాలు ఇవ్వలేకపోవడం, బిల్లులు చెల్లించలేకపోడం, అభివృద్ధి చేయలేక పోయిన ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అర్హత లేదంటూ టిడిపి ఎమ్మెల్యేలు చేసిన నిరసనకు సమాధానం చెప్పలేక స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జగన్‌రెడ్డి పాలన నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు. ఈ బడ్జెటు వాస్తావాని దూరంగా ఉందని, రాష్ట్రంలో రైతాంగం, యువత, మహిళలు ఎవరు సంతోషంగా లేరని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఒకటి, అమలు పరిచేది మరొకటని ఆర్థికమంత్రి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. బుగ్గనకు ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. గత సంవత్సరంలో ఇరిగేషన్‌కు రూ.12వేల కోట్లని చెప్పి రూ.4వేలకోట్లు ఖర్చు చేశారని, రహదారుల గురించి రూ.9వేల కోట్లని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. 54 కార్పోరేషన్లు పెట్టామని, అన్ని కార్పోరేషన్లకు డబ్బులు కేటాయించని అంకెలు చదవడమే తప్ప ఒక్క రుపాయి ఖర్చు చేయలేదని అన్నారు. ఈ బడ్జెట్టు మోసపూరిత బడ్జెట్టు అని, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్టే ఈ ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి ఉరితాడు అవుతుందని అన్నారు.










