Apr 23,2023 23:51

బోరు వద్ద నీటికోపం గిరిజన మహిళల పడిగాపులు

నెలల తరబడి మరమ్మతులకు గురైన బోర్లు
సరిపడా నీరివ్వని జలజీవన్‌ మిషన్‌ కుళాయిలు
గిరిజనం ఇబ్బందులు. పట్టని అధికారులు
ప్రజాశక్తి -సీలేరు
: వేసవి ఎండలు మండుతున్న పరిస్థితుల్లో ప్రజల నీటి అవసరాలు ఒకవైపు పెరుగుతుంటే, మరోవైపు మొరాయిస్తున్న బోర్లు, అడుగంటిన భూగర్భజలాలు, అరకొరగా నీరిచ్చే కుళాయిలతో ప్రజలు తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు. ఏటా వేసవిలో ఇదే పరిస్థితి నెలకొంటుండగా, నీటిఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు చేస్తున్నా వాటి అమలు సరిగా లేక ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు. ధారకొండ పంచాయతీ ఏనుగుబయలు, ధారకొండ కాలనీ,చాకిరేవుగెడ్డలో నీటి కష్టాలే ఇందుక నిదర్శనమని స్థానికులు వాపోతున్నారు.
మండలంలోని దారకొండ పంచాయతీ ఏనుగుబయలు, ధారకొండ కాలనీ, చాకిరేవుగెడ్డలో అరకొర నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏనుగుబబయలులో నాలుగుబోర్లు ఉంటే వాటిలో రెండు బోర్లు కొన్నాళ్లక్రితమే మరమ్మతుకు గురై మూలకు చేరాయి. ధారకొండ కాలనీలో రెండుబోర్లలో ఒకటి, చాకిరేవుగెడ్డలో ఉన్న ఒక్క బోరు మరమ్మతుకు గురైనా పట్టించుకునే దిక్కులేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భూగర్భజలాలు తగ్గిపోవడంతో పనిచేస్తున్న బోర్లులోనూ సన్నటిధారతో నీరు వస్తుండడంతో గంటల తరబడి బోర్లు వద్ద పడిగాపులు పడాల్సి వస్తోందని అంటున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు జలజీవన్‌ మిషన్‌ కింద ఆయా గ్రామాల్లో ఇంటింటికీ నీటి కుళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ నీటి కష్టాలు తీరలేదని స్థానికులు అంటున్నారు. రోడ్డు పనుల్లో భాగంగా ప్రొక్లెయినర్‌తో చేపట్టిన పనులతో జలజీవన్‌మిషన్‌ పైపులైన్లను పీకేయడంతో కొన్నాళ్లుగా కుళాయిలు ఒట్టిపోయాయి, రెండు రోజుల క్రితమే పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి, నీటిసరఫరా పునరుద్ధరించినప్పటికీ, చాలీచాలని నీటి సరఫరాతో మళ్లీ బోర్లు వద్దకు పరుగులు తప్పడం లేదని ఆయా గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. వేసవి తొలిరోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ఇప్పటి నుండే గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పాడైన బోర్లు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవడంతోపాటు జలజీవన్‌మిషన్‌ కుళాయిల ద్వారా పూర్తిస్థాయిలో నీటిసరఫరాకు చర్యలు చేపట్టి, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరుతున్నారు.
నీటి ఎద్దడి నివారించాలి : రాజుకోటి
మారుమూల గ్రామాల్లో ఏటా వేసవిలో నీటి ఎద్దడి నెలకొంటున్నా అధికారులు కనీస ముందస్తు చర్యలు చేపట్టకపోవడం నిర్లక్ష్యమేనని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రాజుకోటి విమర్శించారు. ధారకొండ పంచాయతీలో బోర్లు పాడవ్వడంతోపాటు ఉన్నబోర్లులోనూ నీరు అడుగంటిపోవడం, జలజీవన్‌ మిషన్‌ కుళాయిల ద్వారా పూర్తిస్థాయి నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని రాజుకోటి కోరారు.